కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం : ఎంపీ విజయసాయిరెడ్డి

8 Feb, 2024 08:33 IST|Sakshi

రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ పానలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని వైఎస్సార్సీపీ ఎంపీ శ్రీ వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రజాధనాన్ని సొంత ఏటీఏంగా పరిగణిస్తుందని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాల జాబితా ఎప్పటికీ అంతం కాదని తెలిపారు. యూపీఏ దశాబ్ద పాలనలో రూ.12 లక్షల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. బుధవారం రాజ్యసభలో మధ్యంతర బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

సానుకూలమైన అంశాలతో మధ్యంతర బడ్జెట్‌...
ఈ బడ్జెట్‌లో చాలా సానుకూల అంశాలు ఉన్నాయని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. గతేడాది కంటే ఆరు శాతం అధికంగా రూ.47.65 లక్షల కోట్లు ఖర్చు చేయాలని మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిందని, రెవెన్యూ వసూళ్ళు రూ.30.8 లక్షల కోట్లుగా అంచనా వేయగా, గతేడాది కంటే వసూళ్ళు  12% ఎక్కువగా ఉందన్నారు. మొత్తంగా, ఇది దేశంలో అభివృద్ధి, వ్యయాలకు నిధులు సమకూరుస్తుందని తెలిపారు.

ద్రవ్య లోటును 5.8% నుండి 5.1%కి తగ్గించాలని ప్రభుత్వ యోచన బాగుందని ఇది ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చేందుకు తోడ్పడుతుందన్నారు. కొత్త పథకాల కోసం ఆర్థిక వ్యవహారాల శాఖకు మూలధన వ్యయంగా రూ.70,449 కోట్లు కేటాయించారని, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచడానికి సహాయపడుతుందన్నారు.


గత రెండు దశాబ్దాల్లో పదేళ్లు కాంగ్రెస్‌వల్ల నష్టపోయామని, తదనంతర పదేళ్లలో దేశం వృద్ధి చెందిందన్నారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్‌ దుష్పరిపాలన కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందనడానికి సాక్ష్యం గణాంకాలేనని అన్నారు.

కాంగ్రేసతర పాలనలోనే ఆర్థిక వ్యవస్థ భేష్‌...
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారత్‌ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, కాంగ్రేసేతర ప్రభుత్వాల పాలనలో భారత్‌ యూకే, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలను అధిగమించి ప్రపంచంలోనే అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. కాంగ్రెస్‌ దుష్పరిపాలన వల్లే దేశ ఆర్థికాభివృద్ధి వెనకంజ వేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధిని అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఆర్థికవేత్తలుగా మన్ననలు పొందిన వారు భారత్‌ ఐదు శాతం జీడీపీ సాధిస్తే గొప్ప అని చెప్పినప్పటికీ ఇప్పటికే ఏడు శాతాన్ని దాటిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్‌ను అధికారం నుంచి తరిమికొట్టినప్పుడే దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెంది బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడం యాదృచ్ఛికం కాదన్నారు.

25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి...
కాంగ్రెసేతేర పాలనలో  ఆదాయ అసమానతలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయన్నారు. కాంగ్రేసేతర పాలనలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. దేశంలోని ప్రజల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్‌ పెద్ద శాపంగా ఉందనడానికి ఇవన్నీ సంకేతాలని, ప్రజల అభివృద్ధికి ఆటకంగా ఆ పార్టీ నిలిచిందని విమర్శించారు. 

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా ద్రవ్యోల్బణం గరిష్టస్థాయికి చేరుకుందని, యూపీఏ–1లో 5.8శాతం, యూపీఏ–2లో 10.4 శాతంగా ఉండగా...ప్రస్తుత ప్రభుత్వంలో 4.8 శాతంగా ఉందన్నారు. యూపీఏ హయాంలో 2010–11లో అత్యధికంగా 12.2 శాతం ఉంటే కాంగ్రెస్‌ అధికారంలో లేనప్పుడు అత్యధికంగా 6.7 శాతంగా ద్రవ్యోల్బణం ఉందన్నారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లోనూ అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైందని ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై ఉపన్యాసాలు ఇచ్చే హక్కు కాంగ్రెస్‌కు లేదని శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
 
కాంగ్రెస్‌ హయాంలో భోపోర్స్, 2జీ, కామన్వెల్త్, బొగ్గు, ఆదర్శ్, నేషనల్‌ హెరాల్డ్, డీఎల్‌ఎఫ్, దాణా కుంభకోణాలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని శ్రీ  విజయసాయి రెడ్డి తెలిపారు. చేసిన అవినీతి పనులు చాపకింద నీరుగా దాచడానికి యత్నించినప్పటికీ ప్రజధనాన్ని ఫణంగా పెట్టి కాంగ్రెస్‌ కుబేరులు జేబులు నింపుకున్న చరిత్రను దాయలేరన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో మౌలికసదుపాయాలపై నిర్లక్ష్యం...
కాంగ్రెసేతర ప్రభుత్వ హయాంలో రహదారులు, జాతీయ రహదారుల వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 8.25 శాతంగా పెరిగిందన్నారు. రహదారులపై రాబడి కూడా రూ.32వేల కోట్ల నుంచి రూ.1.12 లక్షల కోట్లకు, నిర్మాణ వేగం రోజుకి 12 కిలోమీటర్ల నుంచి 28 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశానికి జీవనాడి అయిన రైల్వేల అభివృద్ధిని కాంగ్రెస్‌ విస్మరించిందన్నారు. 

యూపీఏ హయాంలో రైల్వేల అభివృద్ధికి రూ.46వేల కోట్లు పెట్టుబడులు పెడితే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని మూడు రెట్లు పెంచిందన్నారు. 2004–14 మధ్య 44 కొత్త విమానాశ్రయాలు నిర్మించగా పదేళ్ల ఎన్డీయే హయాంలో 74 విమానాశ్రయాలు నిర్మించిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో దేశ వృద్ధి సామర్థ్యాన్ని స్తంభింపజేసి మౌలిక సదుపాయాల పరంగా వెనకబాటుతనానికి కారణమైందన్నారు.

ప్రజల సొమ్ము దోచుకోవడమే కాకుండా వ్యాపారవేత్తల వాణిజ్యాన్ని కూడా కష్టతరం చేసిందన్నారు. 2014లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఇండెక్స్‌లో భారతదేశం 142వ స్థానంలోఉంటే ప్రస్తుతం 63వ స్థానంలో ఉందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ కరప్షన్‌ అనే కాంగ్రెస్‌ యుగం తొలిగిపోవడంతో గడిచిన పదేళ్లుగా చిన్న, పెద్ద వ్యాపారాలకు బహుళ ప్రయోజనాలు సమకూరాయని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. 

గడిచిన ఇరవై ఏళ్లు గమనిస్తే... 
2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్‌ దేశ ప్రజలను మోసం చేసిన విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఎంపీ శ్రీ విజయసాయి రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ దేశ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిందని ఆర్థిక నిరాశను పెంచిందన్నారు. తప్పుడు వాగ్ధానాలతో ఖజానాను కొల్లగొట్టి దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలో నెట్టారన్నారు.

కాంగ్రెస్‌ లేకుంటే దేశం ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశంగా మారి ఉండేదని అభిప్రాయపడ్డారు. దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్‌ పాలనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega