మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం

15 Sep, 2022 04:46 IST|Sakshi

అసెంబ్లీ వేదికగా సంక్షేమాభివృద్ధిని వివరిస్తాం 

చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు రావాలి 

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి

సాక్షి, అమరావతి: అభివృద్ధితో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మొహం చూపించలేకే చంద్రబాబు సభకు రావడం లేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. చర్చ అంటూ బయట సవాళ్లు విసరడం కాదని, చంద్రబాబు సహా ప్రతిపక్షం సభకు వచ్చి చర్చించాలని కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానం అని, మూడు రాజధానుల మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని, ఎన్నిరోజులు జరగాలనేది 10 గంటలకు జరిగే బీఏసీ సమావేశంలో ఫిక్స్‌ అవుతుందని చెప్పారు. పలు కీలక అంశాలను ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నామని, ప్రతిపక్షాలు కూడా సభకు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.

సభలో ఎటువంటి చర్చకైనా తాము సిద్ధం అని చెప్పారు. వాళ్ల దగ్గర మాట్లాడటానికి ఏమీ లేక గైర్హాజరవుతున్నారని తెలిపారు. అమరావతి పాదయాత్ర ఉద్దేశం ఏమిటో.. దాని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. ఒకసారి హైదరాబాద్‌ను కోల్పోయి మన రాష్ట్రం నష్టపోయిందని, మళ్లీ మళ్లీ అదే తప్పు చేసేది లేదన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని ప్రసాదరాజు పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారని తెలిపారు. ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశంపై సమాధానం చెప్పటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మూడు రాజధానుల విషయంలో గత అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం జగన్‌ చాలా స్పష్టంగా చెప్పారని, అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందన్నారు.  

మరిన్ని వార్తలు