Munugodu By Elections: మునుగోడు వరకే టీఆర్‌ఎస్‌కు మద్దతు

2 Sep, 2022 03:35 IST|Sakshi

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల వరకే టీఆర్‌ఎస్‌కు తమ మద్దతు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. బీజేపీని ఓడించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాషాయ పార్టీ గెలిస్తే కమ్యూనిస్టులు సహా ఇతర రాజకీయ పార్టీల మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. తమ్మినేని గురువారం విలేకరులతో మాట్లాడారు. మునుగోడు సభ లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అసలు విషయాన్ని ప్రకటించారనీ, రాజ గోపాల్‌రెడ్డి గెలిచిన నెలరోజుల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామన్నా రని గుర్తు చేశారు. పూర్తి మెజార్టీతో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని ప్రశ్నించారు.

ఈడీ, సీబీఐలను ప్రయోగించి ఎమ్మెల్యేలను లొంగదీసుకుంటారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉందని తమ్మినేని చెప్పారు. అయితే మునుగోడులో ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్‌ మూడో స్థానానికి పడిపోయే అవకాశముందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి వచ్చాక ఆ పార్టీ శ్రేణుల్లో కొంత కదలిక వచ్చిందని అభిప్రాయపడ్డారు. మునుగోడులో మద్దతివ్వాలంటూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నాయకులు తమను సంప్రదించారని, బీజేపీని ఓడించే పార్టీకే మద్దతిస్తామని చెప్పామన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కేసీఆర్‌ ఏకం చేస్తున్నారని అన్నారు. 

అదే తమకు సీపీఐకి తేడా...: ‘మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై సీపీఐని సంప్రదించాం. పోటీచేసి ఓట్లు చీల్చి బీజేపీ గెలిచేందుకు మేలు చేయడం కంటే ఓడించాలన్న నిర్ణయానికి వచ్చాం. అయితే ఈ ఎన్నికలతోపాటు సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామంటూ సీపీఐ ప్రకటించింది. మేము మునుగోడు ఉప ఎన్నికల వరకే టీఆర్‌ ఎస్‌కు మద్దతు ఇస్తాం. సాధారణ ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు, బీజేపీ ప్రమాదం వంటి అంశాలను బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అదే సీపీఐకి, మాకు తేడా’ అని తమ్మినేని చెప్పారు. 

మరిన్ని వార్తలు