పొలిమేర నుంచే ప్రణాళిక! సరిహద్దుల నుంచి కీలక నేతల పర్యవేక్షణ 

3 Nov, 2022 03:25 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. హోరాహోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈలోగానే బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. పలివెల వంటి ప్రాంతాల్లో ఒక పార్టీ వారు మరో పార్టీ వారిపై దాడులకు దిగారు. ప్రచారం ముగియడంతో ముఖ్య నేతలంతా నియోజకవర్గాన్ని వదిలివెళ్లారు. కానీ వ్యూహ, ప్రతి వ్యూహాల్లో దిట్టలైన కొందరు నేతలు మాత్రం మునుగోడు నియోజకవర్గం పక్కనే పొలిమేర గ్రామాల్లో తిష్టవేశారు. అక్కడి నుంచే వ్యూహాలను అమలు చేస్తున్నారని.. ఎప్పటికప్పుడు స్థానిక నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిసింది.

ఓటర్లను పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకెళ్లి ఓట్లు వేయించేలా సూచనలు చేస్తున్నారని.. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ వంటివన్నీ పర్యవేక్షిస్తున్నారని.. స్థానిక నాయకులను పిలిపించుకుని సూచనలు చేస్తున్నారని సమాచారం. 

సరిహద్దుల నుంచే సలహాలు..
చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో బుధవారం ఓ టీఆర్‌ఎస్‌ నేతకు చెందిన కారు కనిపించిందని.. ఆయన నియోజకవర్గానికి అవతల ఓ గ్రామంలో మకాం వేశారని స్థానిక నేతలు చెప్తున్నారు. ఓ పార్టీ సీనియర్‌ నేత నల్లగొండ నియోజకవర్గం కనగల్‌ మండలంలో ఉండి పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఇక మర్రిగూడ మండలం శివారు దాటాక రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని ఒక స్థానిక నాయకుడి ఇంట్లో ఓ సీనియర్‌ నేత మకాం వేసి పర్యవేక్షిస్తున్నారని.. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై అక్కడి నుంచే సూచనలు చేస్తున్నారని తెలిసింది.

వనస్థలిపురం సంపూర్ణ థియేటర్‌ పరిసరాల్లోని ఒక హోటల్‌లో మరో సీనియర్‌ లీడర్‌ ఉండి పరిశీలన జరుపుతున్నారని.. మరో ఎమ్మెల్యే వాహనం సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలంలో కనిపించిందని స్థానిక నేతలు చెప్తున్నారు. నార్కట్‌పల్లి వివేరా హోటల్‌లో అడ్డా వేసిన ఓ నేత మునుగోడులోని పరిసర మండలాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. మరోవైపు చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో బుధవారం అధికార పార్టీ నేత వాహనం కనిపించింది. దీంతో ఆ కారులో డబ్బుల సంచులు ఉన్నాయని, కారును తనిఖీ చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ లింగారెడ్డిగూడెంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ మకాం వేసినట్టు తెలిసింది. 

తక్కువగా ఇచ్చారంటూ ఓటర్ల ఆందోళన..
ప్రచారం సందర్భంగా ఓటర్లు ఏది అడిగితే అది ఇస్తామన్న నేతలు మంగళవారం సాయంత్రం నుంచే పంపిణీ మొదలు పెట్టగా.. ఈ ‘పని’లో ఏ ఇబ్బందీ రాకుండా ముఖ్యనేతలంతా చూసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల ప్రచార సమయంలో ఓటుకు రూ.20 వేలు.. రూ. 30 వేలు ఇస్తామని ఒక పార్టీ, తులం బంగారం ఇస్తామని మరో పార్టీ వారు చెప్పారని.. తీరా ఇప్పుడు రూ.3 వేలు, రూ.4వేలు ఇస్తున్నారని కొందరు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం కనిపించింది.

మునుగోడు మండలం కొరటికల్‌తోపాటు ఇతర మండలాల్లోని పలు గ్రామాల్లో ఓటర్లు తమకు తక్కువ మొత్తం ఇచ్చారంటూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో మునుగోడు ఉప ఎన్నిక సర్వేలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఓ సర్వే ఒక పార్టీకి అనుకులంగా.. మరో సర్వే ఇంకో పార్టీకి అనుకూలంగా ఉందని ప్రచారం సాగిస్తున్నాయి. సొంత పార్టీ చేసుకున్న సర్వేలోనే వారు ఓడిపోతారని తేలిందంటూ మరికొందరు సోషల్‌ మీడియా గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు.
చదవండి: ఓటమి భయంతోనే దాడులు.. ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ

మరిన్ని వార్తలు