Chandur Public Meeting: వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి: సీఎం కేసీఆర్‌ సూటి ప్రశ్న

30 Oct, 2022 17:16 IST|Sakshi

LIVE UPDATES: ‘మునుగోడులో యుద్ధం చేయాలి. దేశంలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గం చేనేతలకు చేశారు. నేతన్నలపై జీఎస్టీ విధించి మళ్లీ వాళ్లనే ఓట్లు అడుగుతున్నారు. చేనేత కార్మికులు మునుగోడులో బీజేపీకి ఓటు వేయాలా? బీజేపీకి ఓటు వేయకుండా చేనేతలు బుద్ధి చెప్పాలి. ఇంత అరాచకం జరుగుతుంటే మౌనం పాటిద్దామా?. పెట్టుబడి దారులు, కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోంది.

విద్యుత్‌ సంస్కరణల ముసుగులో మీటర్లు పెడుతున్నారు. మీటర్‌ పెడతామన్న వారికే మీటర్‌ పెట్టాలి. ఎన్నికల్లో చేసే దుర్మార్గమైన ప్రలోభాలకు ఆశపడితే గోస పడతాం. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధం మరొకరిని చేయమనడం సరికాదు. పాలను, నీళ్లను వేరు చేసి చూసే విజ్ఞత ప్రజలకు ఉండాలి. మోదీ విశ్వ గురువు కాదు. విష గురువు. బలవంతంగా రుద్దబడిన ఉప ఎన్నిక వారికి చెంపపెట్టు కావాలి’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

కొంతమంది ఢిల్లీ బ్రోకర్‌ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందకోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూసినట్లు తెలిపారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారని ప్రస్తావించారు. అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు.  రాజకీయం అంటే అమ్ముడుపోడం కాదని తమ ఎమ్మెల్యేలు నిరూపించారని పేర్కొన్నారు. 

మోదీ గారు మీకు ఇంకా ఏం కావాలని.. రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. దీనిపై విచారణ జరగాలన్నారు. వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో, దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలన్నారు.  దీని వెనకున్న వారు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ను పడగొట్టాలని చూశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ముసుగులో వచ్చినవారు చంచల్‌గూడ జైలులో ఉన్నారన్నారు.

కరిసే పామును మెడలో వేసుకుంటామా?
చండూరులో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. మునుగోడులో అవసరం లేకుండా ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఫలితం కూడా మీరు(ప్రజలు) ఎప్పుడో తేల్చేశారని పేర్కొన్నారు. ఎలక్షన్‌ వస్తే చాలు కొందరు హడావిడీ చేస్తరని.. గాయ్‌.. గాయ్‌ గత్తర్‌ గత్తర్‌ లొల్లి నడుస్తుందని అన్నారు. ఒళ్లు మరిచిపోయి ఓటు వేస్తే ఇల్లు కాలిపోతుందని సీఎం సెటైర్లు వేశారు. బావ చెప్పిండనో, బావమర్ధి చెప్పిండనో, డ్యాన్సులు చేశారనో ఓట్లు వేయొద్దని కోరారు.  దోపిడి దారులు మాయ మాటలు చెబుతూనే ఉంటారు. కరిసే పామును మెడలో వేసుకుంటామా అని ప్రశ్నించారు.

సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికకు మరో నాలుగు రోజులు సమయం మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని మరింత జోరు పెంచాయి.  బహిరంగ సభలు, సహావేశాలతో హోరెత్తనున్నాయి. సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావిస్తూ ప్రచారం సాగిస్తున్నాయి.

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ కాసేపట్లో చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరైనట్లు సమాచారం ఇప్పటికే కేసీఆర్‌ చండూరు సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కాగా ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహరంపై  కేసీఆర్‌ మాట్లాడే అవకాశం ఉంది.  దీంతో చండూరు సభ వేదికగా సీఎం ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 

మరిన్ని వార్తలు