నమ్మకానికి, అమ్మకానికి మధ్య యుద్ధం 

5 Oct, 2022 13:29 IST|Sakshi

మునుగోడు ఉపఎన్నికపై మాణిక్యం ఠాగూర్, రేవంత్, భట్టి

నిజాయితీపక్షాన నిలబడాలని ఓటర్లను కోరదాం

మహిళా అభ్యర్థి అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళదాం

పనిచేయని నేతలెవరైనా ఇంటికే

ఇన్‌చార్జీలు రాహుల్‌ యాత్రకు రావొద్దు

ప్రచార వ్యూహంపై కీలక భేటీ.. నేతలకు దిశానిర్దేశం  

సాక్షి, హైదరాబాద్‌: ‘మునుగోడు ఉపఎన్నిక నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో నిజాయితీపక్షాన ఉండాలని ఓటర్లను కోరదాం’అని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పార్టీ నేతలకు సూచించారు. మహిళా సెంటిమెంట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదామని చెప్పారు.

రాష్ట్రంలో 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన నాలుగు ఉపఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లను రెండేసి స్థానాల్లో ప్రజలు గెలిపించినా వారి జీవితాల్లో మార్పు రాలేదని.. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని హామీ ఇద్దామని పిలుపునిచ్చారు. మునుగోడు ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా ముందుకెళ్లాలని, పార్టీ నేతలంతా పరస్పర సహకారంతో అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం కోసం కృషి చేయాలన్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో మంగళవారం గాంధీ భవన్‌లో కీలక సమావేశం జరిగింది.

దాదాపు 3 గంటలకుపైగా సాగిన ఈ భేటీలో మాణిక్యం ఠాగూర్, రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు మునుగోడులో పార్టీ పరిస్థితి, భవిష్యత్‌ కార్యాచరణ, ఇన్‌చార్జీల పనితీరుపై చర్చించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో సామాజిక కోణంలో ముందుకెళ్లాలని నిర్ణయించారు. గతంలో కాంగ్రెస్‌ ఏం చేసిందో, భవిష్యత్తులో సామాజిక వర్గాలకు ఏం చేస్తుందో చెప్పి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు.  

అందరూ సహకరిస్తామన్నారు.. 
►కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధే నన్ను విజయపథంలో నడిపిస్తుంది. పార్టీ నేతలంతా సహకరిస్తామన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా త్వరలోనే ప్రచారానికి వస్తానన్నారు. 
– భేటీ అనంతరం మీడియాతో పాల్వాయి స్రవంతి  

భేటీలో తీసుకున్న నిర్ణయాలివి... 
►ఈ నెల 9 నుంచి నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన 14 వరకు రేవంత్‌ సహా ముఖ్య నేతలంతా మునుగోడులోనే మకాం వేసి ప్రచారం నిర్వహించాలి. 
►శంషాబాద్‌లో రాహుల్‌ గాంధీతో జరిగే సభకు మునుగోడు ప్రజలను సమీకరించాలి. 
►వీధి మలుపు సమావేశాలు, మోటార్‌సైకిల్‌ ర్యాలీలతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలి. 
►అభ్యర్థి స్రవంతికి స్వేచ్ఛగా ప్రచారం చేసుకొనే అవకాశం కల్పించాలి. వీలున్నప్పుడు ఆమెతో కలిసి ప్రచారంలో పాల్గొనే ఇన్‌చార్జి నాయకులందరూ ఎవరికి వారే ప్రచారంలో నిమగ్నం కావాలి. 
►ఇన్‌చార్జీలుగా పనిచేస్తున్న వారు రాహుల్‌గాంధీ పాదయాత్రకు రావాల్సిన అవసరం లేదు. ఏదో ఒకరోజు వచ్చి వెళ్లవచ్చు. 
►ఉప ఎన్నిక ఇన్‌చార్జీలుగా నియమితులైన వారిలో ఎవరు, ఎలా పనిచేస్తున్నారు? ఎన్నిసార్లు నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం నిర్వహించారనే అంశంపై ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో పనిచేయని నేతలు ఎంతటివారైనా ఇంటికి వెళ్లాల్సిందే. 
►ఈనెల 11న 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేసి చివరి రోజైన 14న భారీ జనసమీకరణతో చివరి సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయాలి. 

మరిన్ని వార్తలు