పాత రికార్డులు బద్దలు.. మునుగోడులో 93.41% పోలింగ్..

5 Nov, 2022 02:00 IST|Sakshi

మునుగోడులో మొత్తం ఓట్లు 2,41,805

686 పోస్టల్‌ ఓట్లు కలుపుకొని పోలైన ఓట్లు 2,25,878 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 91.30 శాతం పోలింగ్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ నమోదైంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే 24 వేల మందికి పైగా ఓటర్లు పెరిగారు.

2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం కంటే ఈసారి 2.11 శాతం అదనంగా పోలింగ్‌ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 91.30 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఈసారి 93.41 శాతం మంది ఓట్లు వేశారు. నియోజకవర్గంలో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 686 పోస్టల్‌ ఓట్లు కాగా, 2,25,192 మంది స్వయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాద్, ముంబై నుంచి కూడా.. 
ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్లకు రవాణా సదుపాయం కల్పించాయి. దీంతో హైదరాబాద్, ముంబై, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేశారు. దీంతో పోలింగ్‌ శాతం పెరిగింది. దివ్యాంగులు, మంచానికి పరిమితమైన 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం ఇవ్వడం పోలింగ్‌ శాతం పెరగడానికి దోహదపడింది. 686 మంది పోస్టల్‌బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, అత్యధికంగా నారాయణపురం మండలం చిత్తన్నబావి గ్రామంలో 98.34 శాతం పోలింగ్‌ నమోదైంది.

దామెర బీమనపల్లిలోని 240 పోలింగ్‌ కేంద్రంలో అతి తక్కువ పోలింగ్‌ నమోదైంది. మండలాల వారీగా చూస్తే అత్యధికంగా నారాయణపురం మండలంలో 93.76 శాతం పోలింగ్‌ జరిగింది. చౌటుప్పల్‌ మండలం నేలపట్లలోని 4వ పోలింగ్‌ స్టేషన్‌లో, సంస్థాన్‌ నారాయణపురం మండలం ఐదుదొనెల తండాలో 72వ పోలింగ్‌ కేంద్రంలో, గుజ్జ, నారాయణపురంలో ఒక పోలింగ్‌ స్టేషన్, మునుగోడు మండలం గంగోరిగూడెం, కొండూరు పోలింగ్‌ కేంద్రాల్లోనూ మహిళలు, పురుషుల ఓట్లు సమాన సంఖ్యలో పోలయ్యాయి. 105 పోలింగ్‌ కేంద్రాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓట్లు వేశారు.
చదవండి: ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..?

మరిన్ని వార్తలు