Munugode Bypoll: మునుగోడు వార్‌.. బీజేపీకి మద్దతుగా వారు రంగంలోకి..

5 Oct, 2022 07:41 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడులో ఇక అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. గురువారం నుంచి ఇంటింటి వెళ్లి ఓటర్లను కలిసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పీడ్‌ పెంచింది. అన్ని పార్టీలకు చెందిన వివిధ జిల్లాలకు చెందిన నాయకులు నియోజకవర్గంలో మోహరించనున్నారు.

రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గంలో పర్యటనలకు శ్రీకారం చుట్టింది. నియోజకవర్గంలోని ప్రతి మండంలో మంత్రి జగదీష్‌రెడ్డి పర్యటిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత వలసలపైనా ఫోకస్‌ పెట్టారు. ఆత్మీయ సమ్మ్ళేనాలు, ఆత్మీయ వనభోజనాల వంటి కార్యక్రమాలను కూడా టీఆర్‌ఎస్‌ నిర్వహించింది. వివిధ పథకాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించింది. 6వ తేదీ నుంచి ప్రచారం మరింత పదునెక్కనుంది. 

ఒక్కో యూనిట్‌లో 20 మంది నేతలు
సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ప్రచార కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రతి ఎంపీటీసీ స్థానాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని 86 యూనిట్లలో ఇంటింటికి వెళ్లేలా ప్లాన్‌ చేశారు. మంత్రులు హరీష్‌రావు మర్రిగూడలో, కేటీఆర్‌ గట్టుప్పల్‌లో రంగంలోకి దిగనున్నారు. సీఎం కేసీఆర్‌ లెంకలపల్లి యూనిట్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సమన్వయం చేయనున్నారు. మొత్తానికి ఒక్కో యూనిట్‌లో 20 మంది నేతలతో ప్రచార బృందాలు పని చేయనున్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును బుధవారం ప్రకటించే అవకాశం ఉంది.

ఇంటింటి ప్రచారంలో..
తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. పెద్ద ఎత్తున చేరికలకు శ్రీకారం చుట్టారు. ప్రచార వ్యూహంపై ఇటీవలే నియోజవర్గ ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ గత నెలలోనే మండల ఇన్‌చార్జీలను నియమించింది. 27వ తేదీన సమావేశమై కార్యాచరణ  రూపొందించింది. పాత, కొత్త నేతలను సమన్వయం చేసుకొని ముందుకు సాగేందుకు మండల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు.

బూత్‌కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. 6వ తేదీలోగా ఆ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు ఇంటింటి ప్రచారం చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే ఈటల రాజేందర్, వివేక్‌ వెంకటస్వామి, గంగిడి మనోహర్‌రెడ్డి వంటి నేతలు నియోజకవర్గంలో ఉండి పనిచేస్తున్నారు. బీజేపీకి మద్దతుగా ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ప్రచార రంగంలోకి దిగింది. దసరా తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన దాదాపు 800 మంది స్వయం సేవకులు నియోజకవర్గంలోనే ఉండి పని చేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిసింది.

హస్తం.. ప్రచారంలో వేగం
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన వెంటనే అన్ని పార్టీల కంటే ముందే కాంగ్రెస్‌ పార్టీ భారీఎత్తున బహిరంగ సభ నిర్వహించింది. ఇటీవల పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆమె తన ప్రచారంలో వేగం పెంచారు. ప్రతి గ్రామానికి ఓటర్లను కలుస్తున్నారు. పండుగ తరువాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ప్రచారంలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ మండల ఇన్‌చార్జీలను నియమించింది. పండుగ తర్వాత వారంతా ప్రచారంలోకి దిగనున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు భట్టివిక్రమార్క, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి తదితర నేతలంతా మునుగోడులోనే మకాం వేయనున్నారు. 

మరిన్ని వార్తలు