మునుగోడు కాంగ్రెస్‌లో ట్విస్ట్‌.. ‘బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్న వెంకటరెడ్డి!’

8 Oct, 2022 17:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్‌ రసవత్తరంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలు మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్లాన్స్‌ రచిస్తున్నారు. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచార పోరులో బిజీగా ఉన్నాయి. మూడు జాతీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 

ఇలాంటి తరుణంలో మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం మొదలైనట్టుగా తెలుస్తోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మునుగోడు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక, బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. తాజాగా రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరి మధ్య వైరుధ్యం ఉన్నట్లు ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్  మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లు అపోహలు కల్పిస్తున్నారు. కేసీఆర్ ఒక ఆర్ధిక ఉగ్రవాది. గతంలో గులాబీ కూలీ పేరుతో నిధులు వసూలు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రం నలమూలలా వందలాది కోట్లు వసూలు చేశారు. 

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిధులను వసూలు చేయడం నేరం. ఈ విషయంపై ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పార్టీ చందాలు వసూలు చేశారని కేసును క్లోజ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘ నియామవళి ప్రకారం 20వేల కంటే ఎక్కువ నగదు రూపంలో చందాలు తీసుకోవద్దు. 20వేల కంటే ఎక్కువ ఖర్చు చేయొద్దు. దీనిపై నేను ఎన్నికల సంఘాన్నీ కలిసి చర్యలు తీసుకోవాలని కోరాను. కేసీఆర్‌పై కేంద్రం కూడా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు’ అని కామెంట్స్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు