Munugode By Election: మునుగోడులో ఏం జరుగుతోంది.. కేసీఆర్‌కు ఊహించని షాకిచ్చారు?

12 Aug, 2022 16:45 IST|Sakshi

Munugode Assembly constituency.. సాక్షి, మునుగోడు: గత కొద్దికాలంగా ఉప ఎన్నికలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి కలిసి రావడంలేదు. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలే ఇందకు నిదర్శనం. ఇక, తాజాగా మునుగోడులో కూడా అధికార పార్టీకి మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చేలా ఉంది. మునుగోడులో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. 

టీఆర్‌ఎస్‌ నేత కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతల్లో వ్యతిరేక తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసమ్మతి నేతలు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, రెండు రోజుల క్రితం.. మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లను మంత్రి జగదీష్‌ రెడ్డి పిలిపించుకుని మాట్లాడిన విషయం తెలిసిందే. వీరంతా ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ సందర్భంగా సీఎంకు కూడా హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తామని ప్రగతిభవన్‌ వేదికగా నేతలు ప్రకటించారు. కానీ, ఆ ప్రకటనను తుంగలో తొక్కుతూ కేసీఆర్‌కే షాకిచ్చినట్టు తెలుస్తోంది.  

అయితే, శుక్రవారం అనూహ్యంగా అసమ్మతి నేతలంతా చౌటుప్పల్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, అసమ్మతి నేతలంతా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్లకు టికెట్‌ ఇస్తే.. పార్టీ ఓడిపోతుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు టికెట్‌ ఇస్తే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే ప్రస్తకే లేదని తెగేసి చెబుతున్నారు. దీంతో, అధికార పార్టీకి ఊహించని షాక్‌​ తగిలింది. ఇక, అంతకు ముందే.. టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు.. కూసుకుంట్లకు టిక్కెట్‌ ఇవ్వొదని 12 మంది కీలక నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌కు లేఖలు రాశారు.

ఇది కూడా చదవండి: మునుగోడు ఉప ఎన్నికపై రాజగోపాల్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు