Munugode By Poll: మునుగోడు ఉప ఎన్నిక; కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరు?

3 Aug, 2022 15:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు రాజగోపాల్‌ రెడ్డి మంళగవారం రాత్రి ప్రకటించారు. రాజగోపాల్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికకు పిలుపునిచ్చారు. బై ఎలక్షన్‌లో రాజగోపాల్‌ రెడ్డికి భంగపాటు తప్పదని అన్నారు. 


అభ్యర్థి ఎవరు?

కేసీ వేణుగోపాల్‌తో జరిగిన పార్టీ రాష్ట్ర ముఖ్యనేతల సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతితోపాటు గౌడ, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన నాయకుల పేర్లను పరిశీలించినట్టు సమాచారం. సంస్థాన్‌ నారాయణపురం మండలానికి చెందిన రియల్టర్‌ కృష్ణారెడ్డిని బరిలో దింపే అంశంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. ఎవరు పోటీచేసినా గెలిపించే బాధ్యతను నల్లగొండ జిల్లా నాయకత్వమే చూసుకోవాలని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. 


ఉప ఎన్నిక కోసం కమిటీ 

రాజగోపాల్‌ రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమయ్యే నేపథ్యంలో.. ప్రత్యేక వ్యూహ, ప్రచార కమిటీని కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో.. నేతలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్‌కుమార్‌ యాదవ్, సంపత్‌కుమార్, ఈరవత్రి అనిల్‌లను సభ్యులుగా నియమిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ చెప్పారు. (క్లిక్: రేవంత్‌ రెడ్డిని ఉతికి ఆరేసిన కోమటిరెడ్డి)


సస్పెండ్‌ చేస్తారనే..! 

రాజగోపాల్‌ రాజీనామా ప్రకటనపై కాంగ్రెస్‌లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పార్టీకి విధేయుడైన నాయకుడిని కోల్పోయామని కొందరు అంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారనే ఉద్దేశంతోనే రాజీనామా ప్రకటన చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. సోమవారం రాత్రి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో జరిగిన సమావేశం సందర్భంగా.. మంగళవారం నిర్ణయం తీసుకోవాలని, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తా­మని అధిష్టానం నుంచి సమాచారం అందిందని, ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారని గాంధీభవన్‌ వర్గాలు చెప్తున్నాయి. (క్లిక్: కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా?)

Poll
Loading...
మరిన్ని వార్తలు