Munugodu Politics: కసరత్తు పెంచిన టీఆర్‌ఎస్‌.. 88 మంది ఎమ్మెల్యేలు ఇక్కడే

4 Sep, 2022 13:42 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : మునుగోడులో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ భారీ వ్యూహం అనుసరించబోతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 88 ఎమ్మెల్యేలకు మునుగోడులో బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో శనివారం సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో రెండు ఊర్లకు ఒకరు చొప్పున 88 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. గ్రామాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించి ఆ జాబితాను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి త్వరలోనే అందజేస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి వెళ్లే ప్రతి ఎమ్మెల్యే తన వెంట 15 మంది కరడుకట్టిన పార్టీ కార్యకర్తలను వెంటబెట్టుకొని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో మమేకమై పనిచేసేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబరు 17న జాతీయ సమైక్యతా దినం నిర్వహణతోపాటు వజ్రోత్సవ కార్యక్రమాల తర్వాత వారంతా పూర్తిస్థాయిలో మకాం వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ తమకే పరిస్థితి అనుకూలంగా ఉందని పేర్కొన్న సీఎం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడులో గెలిచి తీరాలని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఉప ఎన్నిక నేపథ్యంలో...
రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని శనివారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటంతో నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి కొంత మేలు జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మునుగోడు నియోజకవర్గంలోనూ 3 వేల మందికి ప్రయోజనం కలుగనుంది.

మరోవైపు ప్రతి నియోజకవర్గంలో దళితబందు 100 కుటుంబాలకు ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం మరో 500 కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మునుగోడులో 600 దళిత కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. పోడు భూములపైనా కదలిక వచ్చింది. ప్రతి జిల్లాలో మంత్రుల నేతృత్వంలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపూర్‌ మండలంలో పోడు భూముల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు