కేంద్రం మూల్యం చెల్లించక తప్పదు

20 Oct, 2021 04:30 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంపీ సత్యనారాయణ

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

250వ రోజుకు చేరిన ఉక్కు రిలే దీక్షలు

అగనంపూడి (గాజువాక): ప్రజాభీష్టాన్ని కాదని ముందుకు వెళ్లే ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే తగిన మూల్యం చెల్లిం చుకోక తప్పదని విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సారథ్యంలో చేపట్టిన రిలే దీక్షలు 250వ రోజుకు చేరిన సందర్భంగా మంగళవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ సమావేశాల్లో నిరసన గళం విప్పామన్నారు. ఇకపై జరగబోయే ఏ సమావేశాల్లోనైనా ఆంధ్రుల అభీ ష్టాన్ని తెలియజేస్తూ నిరసన తెలుపుతామని చెప్పారు. ఉద్యమానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

ఆంధ్రులకు ఉన్న ఏకైక అతిపెద్ద కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పామని తెలిపారు. ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూ రావు, కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని ముఖ్యమంత్రి జగన్‌ సారథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు గుర్తుచేశారు. అయినా కేంద్రం ముందుకు వెళ్తే భవి ష్యత్‌లో జరగబోయే పరిణామాలకు బాధ్యత వహిం చాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రుల మనోభావాలతో ఆడుకోవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు.

అలాకాదని మొండిగా వెళ్తే బీజేపీ పాలకులు రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి  గురికాక తప్పదని చెప్పారు. పోరాట కమిటీ నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వేలమంది నిర్వాసితుల త్యాగం వల్ల ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే నిర్వాసితులు, ఉద్యోగుల భవిష్యత్‌ ఏమిటని ప్రశ్నించారు.

కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు.  ఏయూ మాజీ వీసీ జి.ఎస్‌.ఎన్‌.రాజు, ఉక్కు మాజీ డైరెక్టర్‌ కె.కె.రావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంటోందని చెప్పారు. కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి నాయకులు జె.వి.సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ నగర ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడారు.  

మరిన్ని వార్తలు