స్టీరింగ్‌ నా చేతిలోనే ఉంది..

28 Nov, 2020 07:27 IST|Sakshi

అందరి సహకారంతో ప్రభుత్వం ముందుకుపోతోంది

ప్రభుత్వం కూలిపోతుందని అనుకున్నవారి కలలు వమ్ము చేశాం 

ప్రజల ఆశీర్వాదాలు మాకుంటే, ఈడీ, సీబీఐలతో భయమెవరికి? 

మా పిల్లలను ఇబ్బంది పెట్టాలనుకునేవారికి కూడా పిల్లలున్నారు 

నానమ్మ తన పిల్లలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలనుకునేది 

‘సామ్నా’కు ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే 

మహావికాస్‌ అఘాడి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి 

సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వ స్టీరింగ్‌ తన చేతిలోనే ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. ప్రజల ఆశ్వీరాదాలు తమ ప్రభుత్వానికి ఉన్నాయని, ఇక ఈడీ, సీబీఐలతో భయమెందుకని? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో మండిపడ్డారు. 2019 నవంబర్‌ 28న ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి మహావికాస్‌ అఘాడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి ప్రభుత్వం కొలువుదీరి నేటితో ఏడాది పూర్తయిన నేపథ్యంలో శివసేన ముఖపత్రిక ‘సామ్నా’కు ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

సామ్నా సంపాదకుడైన శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తీసుకున్న ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై సీఎం ఉద్ధవ్‌ మాట్లాడారు. ముఖ్యంగా ఈడీ, సీబీఐ దాడులు, ప్రతిపక్షాల ఆందోళనలపై తనదైన శైలిలో అందరికి వివరించారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ ఘాటైన సమాధానాలిచ్చారు. మహావికాస్‌ అఘాడి కూటమి గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ‘ఇప్పుడు పడిపోతుంది.. అప్పుడు పడిపోతుంది’అంటూ తరచూ కలలు కంటున్నాయన్నారు.

కానీ వారం రోజుల్లో పడిపోతుందని, తాము ప్రభుత్వాన్ని కూలుస్తామని పేర్కొన్న ప్రతిపక్షాలు చూస్తుండగానే తమ ప్రభుత్వం విజయవంతంగా మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటోందని ఉద్దవ్‌ పేర్కొన్నారు. ఈడీ, ఇతర కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ తమపై ఒత్తిడి పెంచేందుకు చూస్తున్నారని ఆరోపించారు. కుటుంబం, పిల్లల వెంటపడి పైశాచికానందం పొందే వాళ్లకు తమకు కూడా పిల్లలు, కుటుంబం ఉందన్న సంగతి మరిచిపోవద్దని గుర్తు చేశారు. కానీ తమకు సంస్కారం ఉందని, అందుకే తాము శాంతంగా, సహనంతో ఉన్నామన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఇలా అనేక విషయాలపై ఆ ఇంటర్వ్యూలో సీఎం ఉద్ధవ్‌ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు.   (రైతుల ‘చలో ఢిల్లీకి’ అనుమతి)

పవార్‌ తమకు మార్గదర్శి... 
‘ముఖ్యమంత్రి అయినప్పటికీ నా కాళ్లు భూమి మీదనే ఉన్నాయి. అదేవిధంగా బండికి క్లచ్, బ్రేక్‌లు, ఎక్సిలేటర్‌తో పాటు స్టీరింగ్‌ కూడా ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ బండికి కూడా అన్ని ఉన్నాయి, దాని స్టీరింగ్‌ కూడా నా వద్దే ఉంది’అంటూ ప్రతిపక్షాల ఆరోపణలకు ఉద్ధవ్‌ ఠాక్రే సమాధానమిచ్చారు. శరద్‌ పవార్‌ తమకు మార్గదర్శకులని, రిమోట్‌ కంట్రోలర్‌ కాదని కూడా పరోక్షంగా చెప్పుకొచ్చారు. అసలు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది జరగని పని అని ముందు అంతా భావించారు, కానీ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలోని అనుభవమున్న నేతలతో ఉద్ధవ్‌ ఠాక్రే కలిసి పనిచేయగలరా అని అనేక ప్రశ్నలు అందరి మదిలోనా మెదిలాయి.

ముఖ్యంగా ముఖ్యమంత్రితో భేటీ కంటే ముందు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌తో భేటీ అవుతారని, ఆయనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారా..? తదితర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు..? ఉద్ధవ్‌ ఠాక్రేనా..? లేక అజిత్‌ పవారా? అంటూ బహుజన్‌ అఘాడీ నేత ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ఇటీవలే ప్రశ్నిస్తూ ఆరోపణలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో తనదైన శైలిలో ఈ ప్రశ్నలన్నింటికీ ఉద్ధవ్‌ సమాధానం ఇచ్చారు. అందరి సహకారంతో తమ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అందరి సహకారంతో నడుస్తున్నప్పటికీ, ప్రభుత్వ స్టీరింగ్‌ మాత్రం తన చేతిలోనే అంటే తన నేతృత్వంలోనే నడుస్తుందన్నది అందరికీ తెలిసేలా చెప్పారు.

అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం.. 
రాష్ట్రంలో అందరి సహకారంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కరోనా మహమ్మారి వచ్చిందని, అయితే గత సంవత్సరం కాలంలో మిత్ర పక్షాలు, ప్రభుత్వ అధికారులు అందరూ సహకరించారని ఉద్ధవ్‌ చెప్పారు. ఇందుకు ఆయన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మా మిత్ర పక్షాల నేతలతో పాటు ఇతర సహకార పార్టీలు కూడా తమ వంతు సహకరించాయన్నారు.   (ప్రమాదకరంగా సెకండ్‌ వేవ్‌)

ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలనుకునేది.. 
తమ నానమ్మ (శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాల్‌ ఠాక్రే తల్లి) తన పిల్లలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలనుకునేదని ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. అయితే ఆమె పిల్లలు రాష్ట్రంలో ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారని, మనుమలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. 

హిందుత్వమంటే ఆలయంలో గంట కొట్టడం కాదు 
హిందుత్వం అంటే ఆలయాల్లో గంట కొట్టడం కాదని, ఉగ్రవాదుల గుండెల్లో గంటలు మోగించేలా చేయడమని ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలోని మట్టికి హిందుత్వాన్ని ఎవరూ నేర్పించవద్దు. ఎందుకంటే కాషాయ సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ స్థాపించారు. నేను శివసేన అధినేత, మా తాతల హిందుత్వ సిద్ధాంతాలను నమ్ముతాను. వారు మనకు ఆలయాల్లో గంట కొట్టేవారు కాదు, ఉగ్రవాదుల గుండెల్లో గంటలు మోగించే హిందువులు కావాలి అనేవారు. ఇలాంటి నేపథ్యంలో మహారాష్ట్ర మట్టికి మీరు హిందుత్వం గురించి నేర్పించాల్సిన అవసరం లేదు’అని ఘాటు సమాధానమిచ్చారు.   

మరిన్ని వార్తలు