ఈ విజయం కేసీఆర్‌కు అంకితం: నోముల భగత్‌

2 May, 2021 16:57 IST|Sakshi

నాగార్జునసాగర్: ఉప ఎన్నికలో తనను గెలిపించిన ఓటర్లకు, నాగార్జునసాగర్‌ ప్రజలకు విజేత నోముల భగత్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల అనంతరం స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ.. నన్ను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ప్రజలకు నా పాదాభివందనం అని తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని చెప్పారు. నాన్న ఆశయాలు నెరవేరుస్తానని, అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ విజయం కేసీఆర్‌కు అంకితం అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని తెలిపారు.

విజయంతో పొంగిపోవడం లేద: మంత్రి
సాగర్ నియోజకవర్గంలో 19 వేలకు పైగా మెజార్టీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మంత్రి జగదీశ్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం సీఎం కేసీఆర్ పట్ల నమ్మకానికి, నాయకత్వానికి నిదర్శనం అని పేర్కొన్నారు. చిన్న నిర్లక్ష్యానికి కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ నోటికి వచ్చినట్లు మాట్లాడాయని తెలిపారు. ఈ విజయంతో పొంగిపోవడం లేదు అని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారని గుర్తుచేశారు. 60 ఏళ్లలో తాగు, సాగునీటికి ఇబ్బందులు పడ్డ నల్గొండ జిల్లా తెలంగాణ వచ్చాక రాష్ట్రంలోనే అత్యధికంగా వరి దిగుబడి తెచ్చిందని మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు.

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి
నాగార్జునసాగర్‌పై గెలుపుపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడారు. తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఈ ఫలితాలను చూసైనా బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మరు అని కొట్టిపడేశారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు కేంద్రం నుంచి రావాల్సిన వాటికోసం పోరాడండి అని సూచించారు. వాక్సిన్‌లు, రిమిడిసివర్ ఇంజక్షన్‌లు తేవడంలాంటివి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు, అబద్ధాలు చెప్పారు అని గుర్తు చేశారు. విషబీజాలు నాటితే ప్రజలు విశ్వసించరు అని పేర్కొన్నారు. ప్రతి మండలంలో టీఆర్ఎస్‌ఖే స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని చెప్పారు.

చదవండి: బెంగాల్‌ తీర్పుతో బీజేపీ తెలుసుకోవాల్సింది

మరిన్ని వార్తలు