రచ్చ రచ్చ.. మైదుకూరు టీడీపీలో డీఎల్‌ ‘చిచ్చు’

30 Jun, 2022 15:01 IST|Sakshi

టిక్కెట్‌ నాదేనంటూ ప్రచారం 

పార్టీలో చేరకుండానే సరికొత్త ఎత్తులు 

ఇప్పటికే చంద్రబాబు, లోకేష్‌లతో సంప్రదింపులు 

టిక్కెట్‌ తనదేనంటున్న పుట్టా సుధాకర్‌ యాదవ్‌ 

డీఎల్‌ జిమ్మిక్కులు నమ్మొద్దంటూ క్యాడర్‌కు సందేశం

సాక్షి ప్రతినిధి, కడప: రాబోయే ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ టిక్కెట్‌ నాకంటే నాకంటూ మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌లు పోటీపడి ప్రచారం చేస్తున్నారు. దీంతో పచ్చ పార్టీలో రచ్చ రోడ్డెక్కింది. పార్టీలో చేరకుండానే సీనియర్‌ నేత డీఎల్‌ రవీంద్రారెడ్డి టీడీపీలో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోశారు. ఔట్‌డేటెడ్‌ డీఎల్‌కు టీడీపీ టిక్కెట్‌ ఇచ్చే ప్రసక్తే లేదని, రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వర్గం తేల్చి చెబుతోంది. దీంతో మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
చదవండి: టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.40 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’

వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. జులై నెల నుంచి నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రచారం చేయనున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. దశాబ్దకాలంగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న డీఎల్‌ ఇటీవలి కాలంలో అధికార పార్టీపై పనిగట్టుకుని విమర్శలకు దిగుతూ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మధ్యే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లను డీఎల్‌ హైదరాబాదులో కలిశారు. తర్వాత నియోజకవర్గానికి వచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తన అనుయాయులతోపాటు మీడియాకు వెల్లడించారు.

త్వరలోనే నియోజకవర్గంలో తిరుగుతానని చెప్పిన డీఎల్‌ అందుకోసం వేద పండితులను సంప్రదించి ముహూర్తం సైతం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోగా మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించాలని టీడీపీ అధిష్టానంపై డీఎల్‌ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో మైదుకూరులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తప్ప మిగిలిన వ్యక్తులు ఇప్పటివరకు గెలువలేదని చంద్రబాబు, లోకేష్‌లకు గణాంకాలతో డీఎల్‌ వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకే టిక్కెట్‌ ఇవ్వాలని, ఒకవేళ సుధాకర్‌ యాదవ్‌కు ఇచ్చినా గెలిచే ప్రసక్తే లేదని డీఎల్‌ తేల్చి చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు ఎటూ తేల్చకపోవడంతో వెనుదిరిగి వచ్చిన ఆయన తనకే టిక్కెట్టు అంటూ మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. 

డీఎల్‌ది మైండ్‌ గేమ్‌....టిక్కెట్‌ నాదే!
రాబోయే ఎన్నికల్లోనూ మైదుకూరు టిక్కెట్‌ తనకేనని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ధీమాగా ఉన్నారు. డీఎల్‌కు టీడీపీ టిక్కెట్‌ అన్న ప్రచారం నేపథ్యంలో ఆయన మూడు రోజుల కిందట పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. అనంతరం డీఎల్‌ మైండ్‌ గేమ్‌ మాటలు ఎవరూ నమ్మవద్దని నియోజకవర్గంలోని తన వర్గీయులకు తేల్చి చెప్పారు. సుధాకర్‌ యాదవ్‌ ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఆర్థికంగా నష్టపోయాడని, రెండుసార్లు ఓడిపోయాడన్న సానుభూతితోపాటు ఆర్థికంగా బలోపేతంగా ఉండడం ఆయనకు రాబోయే ఎన్నికల్లో కలిసి వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

బీసీ సామాజిక వర్గం మొత్తం సుధాకర్‌ యాదవ్‌కు అండగా నిలవనుందని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో సుధాకర్‌యాదవ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ వర్గం ఈ దఫా ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్‌ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవైపు డీఎల్‌ చెప్పిన రెడ్డి సామాజిక వర్గ సెంటిమెంట్‌ను పదేపదే చంద్రబాబు, లోకేష్‌ చెవిలో వేస్తున్నట్లు తెలుస్తోంది. 

రచ్చకెక్కిన వర్గ విబేధాలు
మైదుకూరు టీడీపీ టిక్కెట్‌ తనకేనంటూ డీఎల్‌ రవీంద్రారెడ్డి తెరపైకి రావడంతో పార్టీలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. సుధాకర్‌యాదవ్‌ను వ్యతిరేకిస్తున్న కొన్ని వర్గాలు డీఎల్‌కు టిక్కెట్‌ అంటూ ప్రచారం చేస్తుండగా సుధాకర్‌యాదవ్‌కు టిక్కెట్‌ ఇ వ్వకపోతే పార్టీనే వీడుతామని ఆయన అనుచరవ ర్గం అంటున్నారు. ఒకవేళ డీఎల్‌కు టిక్కెట్టు ఇచ్చినా ఆయనను ఓడగొట్టడం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా మైదుకూరు టీడీపీ టిక్కెట్‌ ఎవరికి ఇచ్చినా ప్రత్యర్థి వర్గం సహకరించే పరిస్థితి లేదు.  

మరిన్ని వార్తలు