ఎన్నికల ఎజెండా సెట్టింగ్‌ దిశగా...బీజేపీ సంగ్రామం

4 May, 2022 04:45 IST|Sakshi

5న పాలమూరు ప్రజా సంగ్రామ యాత్రకు నడ్డా 

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. ప్రజలకు బీజేపీ బాసటగా నిలుస్తుందని భరోసా ఇవ్వనున్న నేత

ఎన్నికలకు సిద్ధమయ్యేలా ముఖ్యనేతలకు దిశానిర్దేశం!

సాక్షి, హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, ఎన్నికల ఎజెండాను ఖరారు చేయడం, పార్టీ కార్యకర్తలకు నాయకత్వం అన్ని సమయాల్లో అండగా నిలుస్తుందనే బలమైన సందేశాన్ని ఇవ్వడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా రాష్ట్ర పర్యటన సాగనుందని   ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో సాగుతున్న ‘ప్రజాసంగ్రామ యాత్ర’లో భాగంగా గురువారం నిర్వహించే పాలమూరు బహిరంగ సభ ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం తన వైఖరి స్పష్టం చేయనుందని సమాచారం. మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. ‘ప్రజల గోస–బీజేపీ భరోసా’పేరిట రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి, వారికి బీజేపీ ఎలా భరోసాగా నిలువనున్నదో నడ్డా వివరిస్తారని తెలుస్తోంది. ఇంతవరకు టీఆర్‌ఎస్‌–బీజేపీ–కాంగ్రెస్‌ల మధ్య ఒక స్థాయిలో సాగుతున్న విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం పాలమూరు సభతో మరింత వేడెక్కవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఎన్నికల ఎజెండా సెట్టింగ్‌ దిశగా...
    తెలంగాణ శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓ నిర్దిష్ట ఎజెండా ఖరారుకు నడ్డా సభ దోహద పడుతుందని భావిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా పార్టీ రాష్ట్ర నాయకులు, శ్రేణులు సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సిందిగా నడ్డా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని, ఆయా అంశాలను సోదాహరణంగా వివరించడం ద్వారా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వచ్చేందుకు కృషిచేయాల్సిందిగా కోరతారని పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. టీఆర్‌ఎస్‌కు ప్రత్నామ్నాయం తామేననే అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునివ్వనున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలతో పాటు హామీల అమల్లో తిరోగమనం, రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఆత్మహత్యల పర్వం కొనసాగడం, తదితర అంశాలను నడ్డా ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, వేధింపులకు పాల్పడడం, ఖమ్మంలో సాయిగణేష్‌ ఆత్మహత్య వంటివి ప్రధానంగా ప్రస్తావించనున్నారు. రాష్ట్ర పార్టీకి, కార్యకర్తలకు జాతీయ నాయకత్వం పూర్తి అండదండలు అందిస్తుందని భరోసా కల్పించనున్నారు.

ఇదీ నడ్డా కార్యక్రమం...
    గురువారం మధ్యాహ్నం 12.40కు ప్రత్యేక విమానంలో నడ్డా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. నోవాటెల్‌ హోటల్‌లో మధ్యాహ్న భోజనం చేసి రోడ్డుమార్గంలో మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల దాకా బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమౌతారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల దాకా బహిరంగసభలో పాల్గొంటారు. తిరిగి నోవాటెల్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం కేరళ పర్యటనకు బయలుదేరి వెళతారు.  

మరిన్ని వార్తలు