నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నాగాలు ఎటువైపు ? 

1 Feb, 2023 04:27 IST|Sakshi

శాంతి ఒప్పందం చుట్టూ ఎన్నికలు 

నాగా సమస్య పరిష్కారం బీజేపీకి అగ్ని పరీక్ష

నాగాలాండ్‌లో అంతా ఒకటే పక్షం. అదే అధికార పక్షం. ప్రస్తుతం అక్కడ ప్రతిపక్షం ఊసే లేదు. అభివృద్ధే లక్ష్యంగా రెండేళ్ల క్రితం రాజకీయ పక్షాలన్నీ ఏకమై కొత్త సంప్రదాయానికి తెరతీశాయి.  అయినా ఈ సారి ఎన్నికల్లో అదే పాత సమస్య నాగాల శాంతి చర్చలే ప్రధాన అంశంగా మారింది. 

నాగాలాండ్‌ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు ఈ ఏడాది శాంతి ఒప్పందం చుట్టూనే తిరుగుతున్నాయి. నాగాల చిరకాల డిమాండ్లు నెరవేర్చకపోవడంతో అధికార నేషనలిస్ట్‌ డెమొక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ)–బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా నిలుస్తున్నాయి.

2018 ఎన్నికలకు ముందు నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) చిరకాల మితృత్వాన్ని వదులుకున్న బీజేపీ ఎన్‌డీపీపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్‌డీపీపీకి చెందిన నిఫూయి రాయ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో అధికార బీజేపీ నాగాలు ఆశిస్తున్నట్టుగా ప్రత్యేక జెండా, రాజ్యాంగం ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో వారంతా కాషాయ కూటమికి వ్యతిరేకంగా పని చేయడానికి సిద్ధమయ్యారు.

దశాబ్దాల తరబడి వేర్పాటు వాదుల హింసాకాండతో రక్తమోడుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించాలన్న లక్ష్యంతో 2021లో రాజకీయ పార్టీలన్నీ చేతులు కలిపి యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ (యూడీఏ) ఏర్పాటయ్యాయి. అధికారంలో ఉన్న నేషనలిస్ట్‌ డెమొక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ), బీజేపీ కూటమిలో ప్రతిపక్ష నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) చేరడం రాజకీయంగా కొంత పుంతలకు దారి తీసింది. 

ఎన్‌డీపీపీ–బీజేపీ కలసికట్టుగా పోటీ  
రెండేళ్లుగా అభివృద్ధి ప్రయత్నాలు ముందుకు కదలకపోగా నాగా వేర్పాటు వాద సమస్య తీవ్రతరం కావడంతో ఫిబ్రవరి 27న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌పీఎఫ్‌ ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. గత ఎన్నికల్లో 26 సీట్లలో నెగ్గిన ఎన్‌పీఎఫ్‌ ఈ సారి అధికారంలోకి వచ్చేలా వ్యూహాలు రచిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అచ్చుబెమొ కికోన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎవరితోనైనా పొత్తుకు సిద్ధమని తెలిపారు.

ఈ సారి ఎన్నికల్లో ఎన్‌డీపీపీ– బీజేపీ కలసి కట్టుగా పోటీ చేయనున్నాయి.మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో 40 సీట్లలో ఎన్‌డీపీపీ, 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నాయి.  కాంగ్రెస్‌ పార్టీకి గత ఎన్నికల్లో ఒక్క స్థానం రాకపోయినా ఈ సారి 60 స్థానాల్లోనూ పోటీకి దిగుతోంది. ఎన్నికల తర్వాత ఎన్‌పీఎఫ్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఒక్క స్థానంలో నెగ్గిన జేడీ(యూ) ఈసారి నాగ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చింది. దీంతో బీజేపీ నుంచి జేడీ(యూ)లోకి భారీగా వలసలు మొదలయ్యాయి.  

ఏమిటీ నాగాల సమస్య  
నాగాల వివాదం ఇప్పటిది కాదు. దశాబ్దాల తరబడి భారత నేలపై రక్త చరిత్ర రాస్తూనే ఉంది. బ్రిటీష్‌ కాలంలో మొదలైన ఈ సమస్యపై ఇప్పటికీ నాగాలు పోరాటం చేస్తూనే ఉన్నారు. 1881లో నాగా తెగలు నివసించే నాగాహిల్స్‌ ప్రాంతాన్ని బ్రిటీష్‌ ఇండియాలో భాగం చేశారు. దీనిని నాగా తెగలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ భవిష్యత్‌ తామే నిర్ణయించుకుంటామని స్వతంత్ర నాగా దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామంటూ పలు ఉద్యమాలు నడిపాయి.

తమకు సొంత జెండా, రాజ్యాంగం కావాలంటూ 1946లోనే నాగా నేషనల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎన్‌సీ) ఏర్పాటై వేర్పాటు వాదం దిశగా అడుగులు వేసింది. నాగా ఫెడరల్‌ ఆర్మీ (ఎన్‌ఎఫ్‌ఏ) పేరుతో ఏర్పాటైన తీవ్రవాదులు భారీగా హింసకు పాల్పడేవారు. దీంతో వారిని అణిచివేయడానికి 1958లో నాటి కేంద్ర ప్రభుత్వం సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తెచ్చింది. అప్పట్నుంచి కేంద్రం, నాగాల మధ్య విభేదాలు ముదురుతూనే ఉన్నాయి.

ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌లు ఇప్పటికీ నాగాలు గట్టిగా చేస్తున్నారు. నాగాలు నివసించే ప్రాంతాన్ని అంతటినీ కలిపి 1963లో కేంద్రం నాగాలాండ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 1975లో ఎన్‌ఎన్‌సీలో ఒక వర్గంతో షిల్లాంగ్‌ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం  ఈ సమస్యపై ఎన్‌ఎన్‌సీలో చీలిక వర్గమైన ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎం) బలంగా తన వాణి వినిపిస్తోంది.

ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పాటు మయన్మార్‌లో నాగాలు అధికంగా ఉన్న ప్రాంతాలన్నీ కలిసి గ్రేటర్‌ నాగాలాండ్‌ ఏర్పాటు చేసి సొంత రాజ్యాంగం, జెండా కావాలని గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎం) శాంతి ఒప్పందం కుదుర్చుకొని అప్పటి గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవిని మధ్యవర్తిగా నియమించింది. అయినా చర్చలు ముందుకు సాగలేదు. దీంతో నాగాల శాంతి చర్చలే ఈ సారి అతి పెద్ద ఎన్నికల అంశంగా మారింది.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

 ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు  
►ప్రత్యేక జెండా, రాజ్యాంగం కోరుతూ గ్రేటర్‌ నాగాలాండ్‌ డిమాండ్‌ కోసం దశాబ్దాలైనా నాగా తెగలు గట్టిగా  పట్టుపట్టడం 
►ఏడు ఆదివాసీ సంస్థలతో కూడిన ఈస్ట్రన్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ (ఈఎన్‌పీఓ) రాష్ట్రంలోని 16 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్టాన్ని డిమాండ్‌ చేయడం. ఈ డిమాండ్‌తో 2010 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సెగలు పుట్టిస్తోంది.  
►500 కి.మీ. పొడవైన సరిహద్దుని పంచుకుంటున్న అసోం, నాగాలాండ్‌ మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలు. అసోంలో ఉన్న కొంత భూభాగం తమదేనని, రాష్ట్రంలో కలిపేయాలంటూ డిమాండ్లు ఉన్నాయి.  
►దాదాపుగా 22 లక్షల జనాభా కలిగిన నాగాలాండ్‌లో 90 వేల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి ఉపాధి అవకాశాల కల్పన అతి పెద్ద సవాల్‌గా మారింది.  
►నాసిరకం రోడ్లు, మౌలికసదుపాయాల కొరత, విద్య, ఆరోగ్యం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి.    

మరిన్ని వార్తలు