సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ఓడించి చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు  

3 Mar, 2023 09:13 IST|Sakshi

కోహిమా: 60 ఏళ్ల నాగాలాండ్‌ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్‌డీపీపీ టిక్కెట్‌పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్‌–3 స్థానం నుంచి సల్‌హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం.

నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ–బీజేపీ హవా 
నాగాలాండ్‌లో అధికార నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(ఎన్‌డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్‌డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి.

ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్‌జేపీ(రామ్‌విలాస్‌ పాశ్వాన్‌) 2, ఆర్‌పీఐ(అథవాలే) 2, ఎన్‌పీఎఫ్‌ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది.

కాంగ్రెస్‌ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్‌డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు