మమ్మల్ని బండబూతులు తిట్టడం సరికాదు: తలసాని

9 Apr, 2021 18:21 IST|Sakshi

పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

హాలియా : సాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేతలు తమను బండ బూతులు తిట్టడం సరికాదని పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీలోని బాధ్యతగల వ్యక్తులు నీచమైన భాష మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. గురువారం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్‌లో ఉప ఎన్నికలు ఉన్నందున ప్రచారం ఎవ్వరైనా చేసుకోవచ్చు, చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడంలో తప్పులేదన్నారు. ఎప్పుడూ నీతి సూత్రాల గురించి మాట్లాడే జానారెడ్డికి ఎలా మాట్లాడాలో తెలియాదా అని ప్రశ్నించారు.

సాగర్‌ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో  చెప్పే ధైర్యం లేక, ఓటమి తప్పదనే భయంతో జానారెడ్డి ఉన్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యల నివారణకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉపయోగం లేదని, ఎవరు ఆ పార్టీని నమ్మడం లేదని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన యువకుడు, విద్యావంతుడు భగత్‌కు ఓటేసి గెలిపిస్తే నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, యడవెల్లి మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.  

టీఆర్‌ఎస్‌తో సబ్బండ వర్గాలకు న్యాయం
మాడుగులపల్లి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని ధర్మాపురం, గోపాలపురం గ్రామాల్లో ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జానారెడ్డి 40ఏళ్లుగా చేయలేని అభివృద్ధి ఈ సారి చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నాయకులు చింతరెడ్డి యాదగిరి రెడ్డి,మాజీ ఎంపీపీ దాసరి నరసింహ్మ,పగిళ్ల సైదులు,రాములు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు