మూడుముక్కలాట.. విజయం ఎవరిదో

10 Jan, 2021 08:12 IST|Sakshi

రాజకీయ పార్టీలకు విషమ పరీక్షగా ఉప ఎన్నిక

జానా రాజకీయ మనుగడకే సవాల్‌

 సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకోవడం టీఆర్‌ఎస్‌కు అత్యవసరం

సాక్షి, హైదరాబాద్‌ : ఒకవైపు వరుస ఎదురుదెబ్బలు తగిలిన అధికార టీఆర్‌ఎస్‌. పైగా వారికది సిట్టింగ్‌ స్థానం. మరోవైపు కాంగ్రెస్‌ అత్యంత సీనియర్‌ నేతకు రాజకీయంగా జీవన్మరణ సమస్య. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ విజయాలు గాలివాటం కాదని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే క్రమంలో ఉన్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీది. ఇలా అందరికీ ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు ‘పరీక్ష’గా నిలిచి... రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. సాగర్‌ ఫలితంతో రాష్ట్ర రాజకీయ భవిష్యత్‌ ముఖచిత్రం ఎలా ఉండనుందనే విషయంలో ఒక స్పష్టత రానుంది. కాబట్టి సాగర్‌లో విజయం మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు అనివార్యమయిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌తో పాటు మంచి ఊపు మీదున్న బీజేపీకి, ఈ ఎన్నికపై గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడ వచ్చే ఫలితం అత్యంత కీలకం కానుంది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. జానారెడ్డి రాజకీయ భవితవ్యాన్ని కూడా ఈ ఎన్నిక నిర్దేశించనుంది. సానుకూల ఫలితం వస్తే జానా గ్రాఫ్‌ రాష్ట్ర రాజకీయాల్లో పెరిగిపోతుందని, అనూహ్య ఫలితం వస్తే మాత్రం ఆయన దాదాపు రాజకీయాల నుంచి తప్పుకుంటారనే చర్చ జరుగుతోంది.

టీఆర్‌ఎస్‌ ప్రాభవానికి పరీక్ష
నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అప్పుడే నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభం అయింది. అభ్యర్థి ఎంపికపై కసరత్తు, పార్టీ ద్వితీయశ్రేణి నాయకుల మధ్య సమన్వయం, నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టి సారించి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అందరికంటే ముందంజలో ఉంది. నోముల సంతాప సభ పేరిట ఇప్పటికే రెండు చోట్ల సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ అభ్యర్థి ఎవరయితే బాగుంటుందన్న కోణంలో సర్వేలు కూడా పూర్తి చేసింది. మొత్తం మీద నర్సింహయ్య కుమారుడు భగత్, గత ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడ్డ ఎంసీ. కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిల అభ్యర్థిత్వాలను ఆ పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే సాగర్‌ ఉపఎన్నిక ఫలితం రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ చరిష్మాకు పరీక్షగా మారుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే సిట్టింగ్‌ సీటు దుబ్బాకను కోల్పోయి, జీహెచ్‌ఎంసీలో ఆశించిన ఫలితం రాని పరిస్థితుల్లో... మరో సిట్టింగ్‌ స్థానంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపు టీఆర్‌ఎస్‌కు అత్యంత అవసరం. పార్టీ ప్రాభవం తగ్గలేదని నిరూపించుకోవాల్సిన అనివార్యత. ఒకవేళ కారు అంచనా ఈ ఎన్నికల్లో తప్పితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాగర్‌ను మళ్లీ దక్కించుకునేందుకు అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డనుంది.

పెద్దాయనకు ‘ఇమేజ్‌’కలిసొస్తుందా!
గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డి ఎక్కువగా అక్కడే గడుపుతున్నారు. వారానికి కనీసం రెండు రోజులు సాగర్‌లోనే ఆయన మకాం వేస్తున్నారు. ఇక, నోముల మరణం తర్వాత జానా మరింత చురుకుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పార్టీ బూత్‌ కమిటీల సమావేశాలు ఓ దఫా పూర్తి చేసిన జానా రెండో దశలో ద్వితీయ శ్రేణి నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని, దూరంగా ఉన్న వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకున్న విస్తృత పరిచయాలను ఉపయోగించుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. రెండో విడతలో ఆయనకు కుమారుడు రఘువీర్‌ కూడా తోడయ్యారు.

తండ్రీ కొడుకులిద్దరూ నియోజకవర్గంలోని చెరో మండలంలో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత చరిష్మా కలిగిన నాయకుడిగా, వివాదరహితుడిగా గుర్తింపు పొందిన జానాకు ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీ నుంచి వెళ్లిపోవడం ప్రతికూలంగా కనిపిస్తోంది. అయితే, నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ బలంగానే ఉందని ఆయన విశ్వసిస్తున్నారు. ఈ కోణంలోనే నియోజకవర్గంలోని యువతను ఆకట్టుకుని వారిని నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆయన ప్రధాన నాయకుడు కావడం, టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉండడం, తాజాగా ఆయన విజ్ఞప్తి మేరకు టీపీసీసీ అధ్యక్ష ఎన్నికను పార్టీ అధిష్టానం వాయిదా వేయడం లాంటి అంశాలు... ఆయనకు సానుకూలంగా మారుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

బీజేపీ అభ్యర్థి ఎవరో?
ఇక, బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గతంలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ పార్టీకి పెద్దగా ఓట్లు రాకపోవడంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్రంగా కష్టపడాల్సి వస్తుందని రాజకీయ వర్గాలంటున్నాయి. సంస్థాగత నిర్మాణం కూడా బీజేపీ అంతగా లేకపోవడంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదితకు పోలైన ఓట్లలో కేవలం 1.48 శాతం (2.675) ఓట్లే వచ్చాయి. తాజా రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన పోటీదారుల్లో ఒకరుగా నిలువడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఇప్పుడు అక్కడ బీజేపీ టికెట్‌ కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీపడుతున్నారు. పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి, గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదితతో పాటు కొంతకాలం క్రితం పార్టీలో చేరిన కడారి అంజయ్య యాదవ్‌ బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు.

ఇద్దరూ పోటీపోటీగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, అంజయ్య నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాకపోవడం ఆయన అభ్యర్థిత్వానికి ఆటంకం అవుతుందని భావించినా.... సాగర్‌లో ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడం కలిసిరానుంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ లాగే సాగర్‌లోనూ కమలనాథులు దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. ఎన్నికల సమయం సమీపించే కొద్దీ వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని, గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలబెట్టి ఈ ఎన్నికల్లో కూడా సత్తా చాటి తెలంగాణలో తమ రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకోవాలన్నది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్‌ వస్తుందని, మార్చిలో సాగర్‌ ఉపఎన్నిక జరుగుతందనే అంచనాతో అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతుండటం గమనార్హం.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు