సాగర్‌ ఫలితం: ప్చ్‌.. డిపాజిట్‌ దక్కలే!

3 May, 2021 09:38 IST|Sakshi

పనిచేయని ఎస్టీ సెంటిమెంట్‌.. 

అంతర్మథనంలో బీజేపీ శ్రేణులు 

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ఫలితం కమలనాథులకు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపినా డిపాజిట్‌ కూడా దక్కకపోవడం బీజేపీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న తరుణంలో సాగర్‌ ఉప ఎన్నిక ఫలితం కమలనాథులకు మింగుడు పడటం లేదు. సాగర్‌ ఎన్నికలో గెలిచి గ్రామీణ తెలంగాణలోనూ పుంజుకుంటున్నామని చెప్పుకోవాలని భావించినా.. అలా జరగకపోవడంతో ఏం చేయాలో పాలుపోనిస్థితిలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి రవినాయక్‌కు 7,676 ఓట్లే రావడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

పనిచేయని మంత్రం... 
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డిని కాదని.. లంబాడా సామాజిక వర్గానికి చెందిన రవినాయక్‌ను బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా బరిలోకి దింపింది. అయితే, ఈ ఎన్నికలో గెలుస్తామని లేదా రెండో స్థానంలో నిలుస్తామనే ఆశలు బీజేపీ నాయకత్వంలో మొదటి నుంచీ కనిపించలేదు. కానీ, ఎస్టీ అభ్యర్థిని రంగంలోకి దింపిన నేపథ్యంలో పరువు నిలుపుకునే ఓట్లు వస్తాయని, కనీసం 20వేలకు పైగా సాధిస్తే తాము గెలిచినట్లేనని ఆ పార్టీ నేతలు భావించారు.

అయితే బీజేపీ ప్రయోగించిన మంత్రం పనిచేయకపోవడంతో రవినాయక్‌ డిపాజిట్‌ కోల్పోవాల్సి వచ్చింది. దుబ్బాక అసెంబ్లీ ఫలితం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న పార్టీకి ఈ ఫలితం షాక్‌ ఇచ్చిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే సాగర్‌ ఎన్నిక ఒక్కటే పార్టీ భవిష్యత్‌ను తేల్చదని పార్టీ నేతలు కొందరు పేర్కొంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఫలితాలను బట్టి పార్టీ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని, ఆ ఫలితాలకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

టీడీపీ అడ్రస్‌ గల్లంతు
టీడీపీ తరపున పోటీ చేసిన మువ్వా అరుణ్‌ కుమార్‌ పరిస్థితి మరీ దారుణం. ఆయన కేవలం 1708 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. అరుణ్‌ కుమార్‌ కంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తలారి రాంబాబు(2970) ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. ‘నోటా’కు 498 ఓట్లు వచ్చాయి. 


రెండో స్థానంలో జానారెడ్డి
టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కుందూరు జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 70,504 ఓట్లు దక్కాయి. 26 రౌండ్ల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో కేవలం రెండు రౌండ్లలో (10,14) మాత్రమే జానారెడ్డి ఆధిక్యత కనబరిచారు. విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌కు 88,982 ఓట్లు వచ్చాయి. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు