ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్‌ కీలక నిర్ణయం!

12 Jan, 2021 08:06 IST|Sakshi

నల్లగొండ, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతరులకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌లో నిరాసక్తత 

నల్లగొండకు దాసోజు, రాములు నాయక్, మానవతారాయ్, బెల్లయ్యనాయక్‌ పేర్ల పరిశీలన

రంగారెడ్డికి కూన, వంశీచంద్, సంపత్, హర్షవర్దన్‌రెడ్డి, ఇందిరాశోభన్‌ల పేర్ల పరిశీలన 

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వొద్దని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. తమకు మద్దతు ఇవ్వాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌లు విడివిడిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి ఇదివరకు విన్నవించారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకుగాను ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కమిటీ వేశారు. ఇతరులకు మద్దతు ఇచ్చే దాని కన్నా తామే బరిలో ఉందామని, పార్టీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు న్నాయని ఆయా జిల్లాల మెజారిటీ నేతలు కమిటీకి సూచించినట్టు గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తో జరిగిన టీపీసీసీ ముఖ్యుల జూమ్‌ కాన్ఫరెన్స్‌లో కూడా అదే అభిప్రాయం వెల్లడైంది.

కాగా, ఈ స్థానానికి  మొత్తం 26 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ అభ్యర్థిత్వం వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, మరో గిరిజన నేత బెల్లయ్యనాయక్‌ల పేర్లను కూడా తీవ్రంగానే పరిశీలిస్తున్నారు. మానవతారాయ్, బెల్లయ్య నాయక్‌లు సోమవారం పార్టీ పెద్దలను కలసి టికెట్‌ విషయమై తమ వాదనలను వినిపించారు. అయితే, టీపీసీసీ ముఖ్యనేతలు కసరత్తు పూర్తి చేసిన తర్వాత ముగ్గురు నేతల పేర్లను ఏఐసీసీకి పంపనున్నారు. 

రంగారెడ్డి ఆశావహులతో చర్చలు
కాగా, రంగారెడ్డి–హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పై సోమవారం గాంధీభవన్‌లో  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజులు సమావేశమై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు. ఈ స్థానానికి టికెట్‌ ఆశిస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్‌.జి.వినోద్‌రెడ్డిలతో కూడా సంప్రదింపులు జరిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, ఓబీసీ సెల్‌ చైర్మన్‌ కత్తి వెంకటస్వామి, ఉపాధ్యాయ నేత హర్షవర్ధన్‌రెడ్డిలతోసహా 24 మంది టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలోంచి మూడు పేర్లను ప్రతిపాదించి మంగళవారం ఏఐసీసీకి పంపనున్నట్టు సమాచారం.   

పిటిషన్‌ పునర్విచారించాలని రేవంత్‌ అభ్యర్థన

ఏసీబీ అభిప్రాయం కోరుతూ 18కి విచారణ వాయిదా 
సాక్షి, హైదరాబాద్‌: తమపై ఏసీబీ నమోదు చేసిన అభియోగాలను విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం సిద్ధమవుతుండగా, పిటిషన్‌ను తిరిగి విచారించాలంటూ రేవంత్‌ ఏసీబీ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. తన తరఫు న్యాయవాది వీడియో కాన్ఫరెన్స్‌లో కొన్ని కీలక అంశాలపై వాదనలు వినిపించలేకపోయారని అందులో పేర్కొన్నారు. మరోసారి విచారణ జరిపితే తమ వాదనలు పూర్తిగా వినిపిస్తామని విన్నవించారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేసిన న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు... ఈ పిటిషన్‌పై అభ్యంతరం ఉంటే తెలియజేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. తమపై నమోదు చేసిన అభియోగాలను ఎలక్షన్‌ ట్రిబ్యునల్‌ మాత్రమే విచారించాలని, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు విచారించే పరిధి లేదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. కాగా, చంద్రబాబు అక్రమ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నందమూరి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 18న వెలువరించనుంది.

మరిన్ని వార్తలు