బాబు కంటే బాలయ్యే బెటర్‌!

22 Sep, 2021 02:08 IST|Sakshi

టీడీపీకి కుప్పంతో పోలిస్తే హిందూపురంలో ఎక్కువ ఎంపీటీసీలు 

చంద్రబాబు కంటే మెరుగ్గా అయ్యన్న, అచ్చెన్న, చింతమనేని, ధూళిపాళ్ల 

టీడీపీ అధినేత దీనావస్థపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ  

సాక్షి, అమరావతి: పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కంటే ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణే మెరుగైన ఫలితాలు సాధించడం ఆసక్తికరంగా మారింది. దేశంలోనే సీనియర్‌ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు కుప్పంలో కేవలం 3 ఎంపీటీసీ స్థానాలను మాత్రమే సాధించగా బాలకృష్ణ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో 7 ఎంపీటీసీలను గెలిపించుకున్నారు. పలువురు టీడీపీ నాయకులు ఇప్పుడు ఈ విషయం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. పలువురు ఇతర నాయకులు కూడా తమ నియోజకవర్గాల్లో చంద్రబాబుతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించినట్లు చర్చించుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 66 ఎంపీటీసీలకుగానూ ముచ్చటగా మూడు చోట్ల మాత్రమే టీడీపీని చంద్రబాబు గెలిపించగలిగారు. నాలుగు మండలాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో ఓడిపోయారు. చివరికి చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలోనూ టీడీపీని గెలిపించలేక చేతులెత్తేశారు. 
 
అన్ని చోట్లా పోటీ చేసి.. సింగిల్‌ డిజిట్‌కే పరిమితం 
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కోసం హోరాహోరీగా పోరాడినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందు నిలవలేకపోయారు. 641 జెడ్పీటీసీలకు 482 చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. గెలిచింది మాత్రం ఆరు జెడ్పీటీసీ స్థానాల్లోనే. అలాగే 6,558 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసి 930 చోట్ల నెగ్గారు. కుప్పంలో కూడా ఇంత దారుణంగా ఓడిపోవడం ఏమిటని టీడీపీ నాయకులు వాపోతున్నారు. పార్టీ ముఖ్య నాయకులు చాలామంది తమ నియోజకవర్గాల్లో రెండంకెల ఎంపీటీసీ స్థానాలను గెలిపించుకోలేక బోల్తాపడ్డారు. చంద్రబాబు పరిస్థితి వారి కంటే దీనంగా మారడం టీడీపీ క్యాడర్‌కు మింగుడు పడడంలేదు.  
 
ఆ 7 జిల్లాల్లో చిత్తూరు.. 
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తాను ప్రాతిని«థ్యం వహిస్తున్న చోట చంద్రబాబు కంటే కాస్త మెరుగ్గా నాలుగు ఎంపీటీసీలను గెలిపించుకున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణమూర్తి లాంటి నాయకులు రెండంకెల ఎంపీటీసీలను సాధించారు. జెడ్పీటీసీల్లోనూ చంద్రబాబు పార్టీ నాయకుల కంటే బాగా వెనుకబడిపోయారు. కుప్పంలో నాలుగింటిలో ఒక్క జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేకపోయారు. ఆరు జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీని మాత్రమే టీడీపీ గెలవగా ఏడు జిల్లాల్లో అసలు ఖాతా తెరవలేదు. ఆ ఏడు జిల్లాల్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఉండడం తమకు తీవ్ర అవమానకరమని సీనియర్‌ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడు తన సొంత మండలం నర్సీపట్నంలో జెడ్పీటీసీని గెలిపించుకోగా చంద్రబాబు కుప్పంలో ఒక్క జెడ్పీటీసీని కూడా సాధించలేకపోయారు. సొంత నియోజకవర్గంలోనే పార్టీని బతికించలేకపోయిన చంద్రబాబు ఇక రాష్ట్రంలో పార్టీని ఎలా నడిపిస్తారనే ప్రశ్నలు పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు