దళితుల్ని కించపర్చే వ్యాఖ్యలు చేస్తే సహించం

8 Nov, 2020 03:48 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దళితులంతా ఒకటై నడుస్తున్నారని.. ఎవరైనా దళితుల్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎంపీ నందిగం సురేష్‌ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో దళితులకు మేలు కలుగుతోందన్న అక్కసుతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు కుటిల యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక దళిత మేధావి పది మందిని పోగేసి దళితులపై దాడులు జరిగిపోతున్నాయంటూ.. చంద్రబాబు తరహాలో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

వాస్తవానికి ఆ మాటల్ని మాట్లాడాల్సింది చంద్రబాబు దుర్మార్గపు పాలనలోనే అని.. ఆ మేధావికి ఇప్పుడే గొంతు వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కులాల కుంపట్లు పెట్టడంలో ఆరితేరిన చంద్రబాబు దళితుల కళ్లను దళితులతోనే పొడిపించాలని చూస్తున్నారన్నారు. దళితులు వాస్తవాల్ని గ్రహించి.. దళిత పక్షపాతి ఎవరు, దళిత ద్రోహి ఎవరో తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. కొందరు దళిత నాయకులు చంద్రబాబు తొత్తులుగా మారి మేధావులమంటూ మాట్లాడుతున్న విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు.

ఇప్పుడు మాట్లాడుతున్న దళిత మేధావులు చంద్రబాబు అరాచక పాలనలో ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఆత్మ వంచన చేసుకుని మాట్లాడొద్దని.. ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. దళితుల ప్రయోజనాల కోసం ఆందోళనలు చేస్తే దళితులుగా తాము కూడా మద్దతు ఇస్తామన్నారు. కానీ.. చంద్రబాబు ప్రయోజనాల కోసం చేస్తే మాత్రం చులకన అవుతారని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు