సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఇదంతా

7 Apr, 2021 17:37 IST|Sakshi

సాక్షి, అమరావతి:   వైఎ​స్సార్‌ సీపీ బాపట్ల లోక్‌ సభ సభ్యుడు నందిగం సురేష్‌.. ఎంపీ  రఘురామకృష్ణంరాజుపై విరుచుకుపడ్డారు. పార్టీ అధ్యక్షుడిపైన పిటిషన్ వేయగానే టీడీపీ వాళ్లు నానా హైరానా చేశారని, మరి అదే పిటిషన్ కొట్టి వేస్తే మాత్రం టీడీపీ, పచ్చ మీడియా నోరు మెదపలేదన్నారు. రఘురామకృష్ణంరాజు తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని లోక్ సభ స్పీకర్‌కు చెప్పారని, మరి తన పార్టీ అధ్యక్షునిపై పిటిషన్ వేసిందాన్ని ఏమంటారో ఆయనకే తెలియాలని అన్నారు. ఆయన ఎన్ని ఫిర్యాదులు చేసినా, పిటీషన్లు వేసినా ఉపయోగం ఉండబోదని స్పష్టం చేశారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం కాదా ఇలాంటి పనులు  చేస్తున్నావంటూ ప్రశ్నించారు.

తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాముడని ప్రజలే తేల్చారన్నారు. అందుకే 151 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. రఘురామకృష్ణంరాజు రాక్షసులతో కలిసి పనిచేస్తున్నారని, వాళ్లకి ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్పారన్నారు. ఇక నైనా ఆ విషయాన్ని ఆయన తెలుసుకుని నడుచుకుంటే మంచిదని హితవు పలికారు. ‘ఢిల్లీలో కూర్చొని వైఎస్సార్సీపీ ఎంపీ అని చెప్పుకుని మాట్లాడటం కాదు. దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలి’ అంటూ సవాల్‌ విసిరారు. ఎప్పటికైనా ఆయనకు తగిన శాస్తి జరగక తప్పదని జోష్యం చెప్పారు. 

( చదవండి: పవన్‌ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి కూడా )

మరిన్ని వార్తలు