Brahmani Meet With JSP Leaders: పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ?: జనసేన నేతలతో నారా బ్రహ్మణి

25 Sep, 2023 07:49 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ-జనసేన పొత్తు ప్రయాణం ఇరు పార్టీల కేడర్‌ను గందరగోళంలోకి నెట్టేస్తోంది. తాజాగా జనసేన నేత నాగబాబు ముందే ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినా.. టీడీపీతో ప్రయాణం తప్పదన్నట్లు ఆయన కార్యకర్తలకు సూచించారు. ఇదిలా ఉంటే.. జనసేన నేతలతో టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి జరిపిన సమావేశంలో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. 

రాజమహేంద్రవరం విద్యానగర్‌లో లోకేశ్‌ క్యాంపు వద్ద ఆయన భార్య బ్రాహ్మణితో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ? అని జనసేన నేతలను ఉద్దేశించి బ్రాహ్మణి ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా కంగు తిన్నారు నేతలు. ఏకంగా తమ అధినేత ఎక్కడంటూ నేరుగా ఆమె అడగడం గురించి వాళ్లు గుసగుసలాడుకున్నారు. ఆయన తన పనిలో తాను బిజీగా ఉన్నారని సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె అవునా.. అన్నట్లు తలవూపారు.

ఇక ఉమ్మడి పోరాటంలో టీడీపీ తమకు మద్దతు ఇస్తేనే ముందుకు సాగుతామని జనసేన నేతలు నారా బ్రహ్మణికి స్పష్టం చేశారు. ఇందుకోసం నిధులు సమకూర్చాలని బ్రాహ్మణిని జనసేన నేతలు కోరినట్టు సమాచారం. ‘నిధుల విషయం తర్వాత మాట్లాడదాం... ఉమ్మడిపోరు ప్రారంభిద్దాం’ అని ఆమె చెప్పడంతో జనసేన నేతలు మెల్లగా జారుకున్నట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు