లోకేషా.. పుడచేరి కాదయ్యా..పుదుచ్చేరి 

6 Apr, 2021 03:38 IST|Sakshi
తిరుపతిలో మాట్లాడుతున్న లోకేష్‌ 

అపస్వర వాక్కులు.. ఆయన హక్కు

టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే గ్యాస్, పెట్రోల్‌ ధరలు తగ్గింపు

రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు

తిరుపతి ప్రచార సభలో వ్యాఖ్యలు

సాక్షి, తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో  సైతం ఎమ్మెల్సీ లోకేష్‌ ప్రసంగం షరా మామూలుగా అపస్వర వాక్కులతో సాగింది.  సోమవారం టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించారు. తిరుపతి గాంధీరోడ్డు నుంచి  మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వరకు రోడ్డుషో నిర్వహించి అక్కడే జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. వైఎస్సార్‌సీపీ నుంచి 22 మంది లోక్‌సభ సభ్యులు, 6 మంది రాజ్యసభ సభ్యులున్నారని, వారు రోబోలుగా మారి ప్రధాని మోదీ ఎదురు పడితే వంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు.

సీఎం జగన్‌రెడ్డి పాలనలో తిరుపతిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదన్నారు. టీడీపీ తరపున ఒక రాజ్యసభ, ముగ్గురు లోకసభ సభ్యులు పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలపై, ప్రత్యేక హోదాపై సింహంలా గర్జిస్తున్నారని తెలిపారు. పుడచ్చేరి (పుదుచ్చేరి)లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అక్కడ ప్రత్యేక హోదా ప్రకటించిందన్నారు. పుదుచ్చేరిని పుడచేరి అంటూ ప్రసంగిస్తున్నప్పుడు సభలో నవ్వుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని జగన్‌ టాక్స్, కరప్షన్, బాదుడు(జేసీబీ) ప్రభుత్వంగా అభివర్ణించారు. ట్రాక్టర్‌ ఇసుక గతంలో రూ.1500 ఉండగా నేడు 5 వేలకు పెరిగి బంగారు ధరను మించిందన్నారు. మద్యనిషేధమంటూ ప్రగల్భాలు పలికిన జగన్‌రెడ్డి ప్రభుత్వం స్పెషల్‌ స్టేటస్‌ బ్రాంది, బూంబూం బీర్లతో సామాన్యుల నడ్డి విరిచి వేల కోట్లు దండుకుంటోందని విమర్శించారు.

ఎన్నికల హామీలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామన్న జగన్‌రెడ్డి ఇప్పటికీ ఆ ఊసే ఎత్తలేదన్నారు. టీడీపీ పాలనలో 5లక్షల 16 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రస్తుత వలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలేనని, రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తిరుమలలో జరిగిన ఓ సమావేశంలో దళితుడైన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి కూర్చునేందుకు కుర్చీ ఇవ్వకుండా.. అగ్ర వర్ణానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానించారని తెలిపారు. టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే గ్యాస్, పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామన్నారు.

   చదవండి: (జనాన్ని విసిగించిన నారా లోకేష్‌)

అధికారుల అంతు చూస్తాం.. 
టీడీపీ కార్యకర్తలపై దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారుల అంతుచూస్తామని లోకేష్‌ హెచ్చరించారు. 2024లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అతిగా వ్యవహరించిన అధికారులకు వడ్డీతో సహా తగిన బుద్ది చెబుతామన్నారు.  

మరిన్ని వార్తలు