పనబాకను గెలిపిస్తే పెట్రోల్‌ ధరలు తగ్గిస్తా.. 

8 Apr, 2021 04:16 IST|Sakshi

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్

నాయుడుపేట: తిరుపతి ఎంపీగా పనబాకను గెలిపిస్తే పెట్రోల్‌ ధరలు తగ్గిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ మరోసారి ఉద్ఘాటించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బుధవారం రాత్రి ఆయన ర్యాలీగా ప్రచారం చేశారు. గడియారం సెంటర్‌లో ఓ టీ స్టాల్‌ వద్ద ఆగిన లోకేశ్‌ ‘టీ తాగుదామా’ అనడానికి బదులు ‘తీ తాకుతామా’ అనడంతో అర్థంకాని నాయకులు ఒకరినొకరు చూసుకున్నారు. సార్‌ టీ తాగుతారంట అని టీ స్టాల్‌ యజమాని చెప్పడంతో వారికి విషయం అర్థమైంది. లోకేశ్‌ టీ తాగుతూ కార్యకర్తలతో ముచ్చటించారు.

అనంతరం పాత బస్టాండ్‌ వద్ద బహిరంగసభలో లోకేశ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆకాశవీధుల్లో తిరుగుతున్నారని, తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాకను గెలిపిస్తే వీధుల్లో తిరిగేందుకు వస్తారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి చేయడం లేదని, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని ఆరోపించారు. అమ్మ ఒడి ఇస్తూ నాన్న బుడ్డి పేరుతో డబ్బు గుంజుకుంటున్నారని మందుబాబులు గమనించాలన్నారు. ప్రభుత్వ పథకాలు కనిపించకుండా చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపైనా లోకేశ్‌ వ్యక్తిగత ఆరోపణలు చేశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు