‘మిత్ర పక్షాల’ భేటీ

17 Dec, 2021 04:22 IST|Sakshi
జనసేన కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలతో లోకేష్‌ కరచాలనం

జనసేన కార్యాలయానికి వెళ్లిన లోకేష్‌

నమస్కారాలు, ప్రతి నమస్కారాలతో పలకరింపులు

వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామన్న చినబాబు

ఇది మన స్థాయిలో తేల్చేది కాదన్న జనసేన చోటా నేత

మీరూ మేమూ ఒకటే అంటూ వెనుదిరిగిన లోకేష్‌  

తాడేపల్లిరూరల్‌:  గుంటూరు జిల్లా కుంచనపల్లిలో గురువారం రాత్రి విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందే కళ్లకు కట్టింది. తెలుగుదేశం నాయకుడు, చంద్రబాబునాయుడి తనయుడు లోకేష్‌ పర్యటనలో భాగంగా రాత్రి కుంచనపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడున్న మహాత్మ గాంధీ, రంగా విగ్రహాలకు పూలమాల వేయాలని మొదట భావించినా.... అప్పటికే అక్కడ పలువురు జనసేన కార్యకర్తలు గుమికూడి ఉండటంతో పక్కకు మళ్లారు.

పక్కనే ఉన్న జనసేన కార్యాలయంలోకి నేరుగా వెళ్లారు. కార్యాలయం లోపలికి వెళుతుండగా... అప్పటికే అక్కడకు వచ్చిన జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షుడు శివనాగేంద్ర రావు ఎదురయి ఆయనకు నమస్కారం చేశారు. నవ్వుతూ... మనం ముందుముందు కలిసి పని చేయాలి అని లోకేష్‌ ప్రతిపాదించారు. అయితే కలిసి పని చేయటం అనేది అధిష్టానం స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని, తమ అధిష్టానం ఏం చెబితే అది చేస్తామని శివనాగేంద్రరావు బదులివ్వటంతో... లోకేష్‌ ముసిముసి నవ్వులు నవ్వారు. మెట్లు దిగుతూ అక్కడున్న జనసేన కార్యకర్తలతో కరచాలనాలు చేశారు.

జనసేన కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలతో లోకేష్‌ కరచాలనం

మీరూ మేమూ ఒకటే అని వ్యాఖ్యానిస్తూ వెనుదిరిగారు. కలిసి పనిచేద్దామని లోకేష్‌ ప్రతిపాదించినట్లు లోకేష్‌ వెళ్లిపోయిన అనంతరం సదరు జనసేన నాయకుడు మీడియాతో మాట్లాడుతూ ధ్రువీకరించారు. కానీ తాను తిరస్కరించానని, అది అధిష్టానం స్థాయి నిర్ణయమని చెప్పానని పేర్కొన్నారు. కాకపోతే పై స్థాయిలో జరుగుతున్నది లోకేష్‌కు తెలుసు కాబట్టే ఆయన జనసేన కార్యాలయానికి వెళ్లాడని, నవ్వుతూ మాట్లాడటంతో పాటు కలిసి పనిచేద్దామని ప్రతిపాదించాడని, మనం మనం ఒకటేనని చెప్పాడని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఎలాగూ రెండు పార్టీలూ కలిసి పనిచేసేవేనన్న విషయం చినబాబుకు తెలుసు కాబట్టే ఆయన అలా వ్యవహరించినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.    

మరిన్ని వార్తలు