మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్‌ ఇచ్చేది లేదు : నారా లోకేష్‌

29 May, 2022 09:44 IST|Sakshi

‘టీడీపీలో దీర్ఘకాలిక పదవుల విధానం రద్దు. వరుసగా మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్‌ ఇచ్చేది లేదు. ఇది నా నుంచే అమలు చేయాలనే 
ఆలోచనలో ఉన్నాం.’ –
మీడియా ప్రతినిధులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: లోకేష్‌ ఝలక్‌ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ఇదే వాస్తవమైతే ఆ జాబితాలో ముందు వరుసలో జిల్లాకు టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిలవనున్నట్లు ఆ పార్టీ నేతలే అంటున్నారు. అయితే సోమిరెడ్డి పరిస్థితి ఏమిటీ? రాబోయే ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్‌ దక్కే అవకాశం లేదా? అని జిల్లా ప్రజానీకంతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుందీ సోమిరెడ్డి పరిస్థితి. ‘మహానాడు’ ఆయన రాజకీయ జీవితానికి సమాధి కానున్న పరిస్థితి ఏర్పడింది. 

జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు సోమిరెడ్డి. వరుస ఓటముల పాలైనా సోమిరెడ్డికి టీడీపీ అగ్రనేత చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఆయనకు స్థానం కల్పించారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని కూడా చేశారు. అయితే తాజాగా మహానాడు వేదికగా నారా లోకేష్‌ ప్రకటన జిల్లా టీడీపీ నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.  జిల్లాలో వరుస ఓటముల చరిత్రలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. టీడీపీ సీనియర్‌ నేతగా జిల్లా నేతలకు పెద్ద దిక్కుగా, పొరుగు జిల్లాల ఇన్‌చార్జి బాధ్యులుగా ఉన్న ఆయన 1994, 99 ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించారు.

 2004, 2009, 2012 (కోవూరు ఉప ఎన్నిక), 2014, 2019ల్లో వరుసగా టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందిన చరిత్ర జిల్లాలో సోమిరెడ్డిదే. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, 2012 కోవూరు ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. వరుసగా అత్యధిక సార్లు ఓడిపోయిన నేతల జాబితాలో సోమిరెడ్డి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నారు. నారా లోకేష్‌ నిర్ణయానికి ఆ పార్టీ కట్టుబడితే సోమిరెడ్డికి పార్టీ టికెట్‌ దక్కడం దుర్లభమే. రాష్ట్ర స్థాయి నేతగా చెప్పుకునే సోమిరెడ్డికి నారా లోకేష్‌ ఝలక్‌ ఇచ్చారని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. యూటర్న్‌లు తీసుకోవడంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అలవాటు, అదే వారసత్వం నారా లోకేష్‌కు కూడా వస్తే తప్పా, సోమిరెడ్డికి బెర్త్‌ కన్‌ఫర్మ్‌ అయ్యే అవకాశం లేదు. లోకేష్‌ ప్రకటన తర్వాత నెటిజన్లు, తెలుగుతమ్ముళ్లు  అయ్యో.. సోమిరెడ్డా! అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు