జనం లేక లోకేశ్‌ పాదయాత్ర వెలవెల

29 Aug, 2023 03:12 IST|Sakshi

లింగపాలెం/చింతలపూడి: ఏలూరు జిల్లా లింగపాలెం, చింతలపూడి మండలాల్లో సోమవారం నారా లోకేశ్‌ పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది. లింగపాలెం మండలంలోని సుందరరావుపేట నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి చింతలపూడి మండలం వెలగలపల్లి, ఫాతిమాపురం గ్రామాల మీదుగా చింతలపూడి శివారు క్యాంప్‌ సైట్‌కు చేరారు. ఎన్‌వీఎన్‌ కాలనీ సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని లోకేశ్‌ ప్రారంభించారు. పాదయాత్రలో నాయకులు, యువగళం టీం సభ్యులు మినహా స్థానిక ప్రజలు ఎక్కడా పెద్దగా కనిపించలేదు.

అక్కడక్కడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్‌తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా, తనకు ఒక చెయ్యి నొప్పిగా ఉందని చెబుతూ మరో చేతిని ఊపుతూ వెళ్లిపోయారు. లింగపాలెం గ్రామ శివారుకు వెళ్లిన తర్వాత మాజీ ఎమ్మెల్యే, స్థానిక మాజీ ప్రజాప్రతినిధిని ‘మీ గ్రామంలో జనం ఏరి..’ అంటూ లోకేశ్‌ ప్రశ్నించారు. కాగా, లోకేశ్‌ క్యాంప్‌ సైట్‌లో పామాయిల్‌ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

టీడీపీ నేతలు ముందుగానే ఎంపిక చేసిన తమ పార్టీకి చెందిన రైతులనే ఈ కార్యక్రమానికి అనుమతించారు. తన తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పామాయిల్‌ రైతులకు ఎంతో మేలు చేసినట్లు చెప్పినా రైతుల నుంచి స్పందన రాకపోవడంతో ‘కనీసం చప్పట్లన్నా కొట్టండయ్యా..’ అంటూ లోకేశ్‌ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవడంతో రైతులు నవ్వుకున్నారు.  

వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత 
లోకేశ్‌ పాదయాత్ర చింతలపూడి వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు చేరుకోగానే ‘సైకో పోవాలి, సైకిల్‌ కావాలి...’ అంటూ మైకులో కేకలు వేయడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ‘జై జగన్‌... వైఎస్సార్‌సీపీ జిందాబాద్‌...’ అంటూ నినాదాలు చేశారు. దీంతో లోకేశ్‌ ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందితోపాటు టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైకి దూసుకువచ్చారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు.    


కూలి ఇవ్వలేదని జెండాలు పారేసి వెళ్లిన వైనం..  
ముసునూరు: ఏలూరు జిల్లాలో జరుగుతున్న లోకేశ్‌ పాదయాత్రలో పెయిడ్‌ ఆర్టిస్టులే కనిపిస్తున్నారు. పల్లెల్లో ప్రజల్లో స్పందన కరువవడంతో పెయిడ్‌ ఆర్టిస్టులతో పాదయాత్ర సాగిస్తున్నారు. పాదయాత్రకు కూలి డబ్బులిస్తామని జనాన్ని తరలించిన విషయం సోమవారం వెలుగుచూసింది. శనివారం యువగళం పాదయాత్ర నూజివీడు మండలం పోతురెడ్డిపల్లిలో ప్రారంభమై మండలంలోని కొర్లగుంట–ముసునూరుల మీదుగా వలసపల్లి వరకు జరిగింది.

ఈ క్రమంలో కొందరు ఆటోలో కాట్రేనిపాడు గ్రామం మీదుగా దగ్గర దారిలో హనుమాన్‌జంక్షన్‌ వైపు వెళుతూ జెండాలను రహదారి పక్కనే పడేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు.. అలా పడేశారేంటని ఆటోలోని వారిని ఆరా తీశారు. కూలి డబ్బులు ఇస్తామని పాదయాత్రకు తీసుకొచ్చారని, కానీ డబ్బులివ్వకుండా తమను మోసం చేశారని ఆటోలోనివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వెనుదిరిగి వెళ్లిపోతున్నామని చెప్పారు.

పాదయాత్రలో పాల్గొనేందుకు తమకు ఇచ్చిన జెండాలు, చొక్కాలను విప్పి దారిలో పారేసి వెళుతున్నామని తెలిపారు. ఈ ఘటనపై కాట్రేనిపాడుకు చెందిన కంబాల రాజేశ్‌ సోషల్‌మీడియాలో పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా రాజేష్‌ సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. పాదయాత్ర తమ గ్రామం మీదుగా జరగలేదని, దగ్గర దారి కావడంతో వీరంతా ఇటువైపు వెళ్లారని చెప్పారు. వారు ఏ గ్రామానికి చెందినవారో చెప్పలేదని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు