చంద్రబాబు దళిత వ్యతిరేకి

29 Aug, 2020 05:23 IST|Sakshi

శవరాజకీయాలు చేయడం తగదు 

మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి 

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌:  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దళిత వ్యతిరేకి అని, కులాల మధ్య చిచ్చుపెట్టి నీచ రాజకీయాలకు పాల్పడిన సంస్కృతి ఆయన సొంతమని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి విమర్శించారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇటీవల పుంగనూరులో అనారోగ్యంతో దళితుడు ఓం ప్రతాప్‌ చనిపోతే దాన్ని చంద్రబాబు రాజకీయం చేయటం దారుణమన్నారు. తమ కుమారుడు అనారోగ్యంతో మరణించాడని ఓం ప్రతాప్‌ తల్లిదండ్రులు చెబుతున్నా చంద్రబాబు అండ్‌ కో శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళిత పక్షపాతియైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దళితులపై దాడిచేశారని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధిపొందాలని చూడడం చంద్రబాబుకు తగదన్నారు.  

► స్వాతంత్య్రానంతరం రాష్ట్రంలోని దళిత గ్రామాలను మట్టుబెట్టిన వ్యక్తి చంద్రబాబే అని విమర్శించారు.  
► కారంచేడు, బషీర్‌బాగ్, పాదిరి కుప్పంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ అన్నారు.  
► రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వారిని ఆర్థికంగా ఆదుకున్నారని చెప్పారు.   

పన్నుల వసూళ్లపై దృష్టి సారించండి 
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో మందగించిన పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారాయణస్వామి ఆదేశించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల, డివిజన్ల కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విజయవాడ నుంచి కమర్షియల్‌ టాక్సెస్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గత సంవత్సరం బకాయిలు రూ. 1,080 కోట్లు రాబట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కమర్షియల్‌ ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ రఘునాథ్, డిప్యూటీ కమిషనర్‌లు హరీష్‌ కుమార్, సోనియా, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు