Chandrababu: కష్టం.. కలవలేం.. చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మోదీ, అమిత్‌ షా

27 Oct, 2021 03:06 IST|Sakshi

రెండు రోజుల ఎదురు చూపుల తర్వాత తిరుగుముఖం

రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వటంతోనే సరి

కష్టపడి ప్లాన్‌ చేసిన ‘షో’కు ఢిల్లీలో నిరాదరణ

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుకు చుక్కెదురైంది. ప్రధాని, హోం మంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం రెండ్రోజులు పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండాపోయింది. డ్రగ్స్‌కు ఏపీ కేంద్రంగా మారిందని ప్రచారం చేయడానికి దేశ రాజధానికి వెళ్లిన చంద్రబాబుకు కేంద్ర పెద్దల నుంచి స్పందన కరువైంది. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం రెండ్రోజులపాటు పడిగాపులు కాసినా ఎవరూ పట్టించుకోలేదు. తనకు ఎలాగైనా అపాయింట్‌మెంట్‌ సంపాదించాలని బీజేపీలో ఉన్న టీడీపీ నేతలతోనూ లాబీయింగ్‌ చేయించారట. కానీ, హోంమంత్రి అమిత్‌ షా.. చంద్రబాబును కలిసేందుకు ఇష్టపడలేదని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అపాయింట్‌మెంట్‌ కోసం చంద్రబాబు కోటరీ గత నాలుగు రోజుల నుంచి అమిత్‌ షా ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. జమ్మూకశ్మీర్‌ పర్యటన ముగిం చుకుని ఆయన మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నప్పటికీ, చంద్రబాబుని కలిసేందుకు  ఏమాత్రం ఆసక్తి చూపించలేదని సమాచారం. దీంతో కేంద్ర మంత్రులెవరూ కూడా చంద్రబాబుకు అవకాశం ఇవ్వలేదంటున్నారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అనే చందంగా వ్యవహరించే చంద్రబాబు వైఖరి తెలిసిన బీజేపీ పెద్దలు చంద్రబాబుకు చాన్స్‌ ఇవ్వలేదు. దీంతో ఆర్టికల్‌–356 అంటూ హడావుడి చేద్దామనుకున్న బాబుకు ఢిల్లీ పెద్దల ట్రీట్‌మెంట్‌ దిమ్మతిరిగేలా చేసింది.

చివరకు జాతీయ మీడియా సైతం మొహం చాటేయడం చర్చనీయాంశమైంది. నిజానికి.. అమిత్‌ షాను చంద్రబాబు కలుస్తారని లీకులిచ్చినప్పుడే.. ఎంపీ జీ వీఎల్‌ నరసింహరావు తమ పార్టీ మనోగతం స్పష్టం చేశారు. అమిత్‌ షా కుటుంబం తిరుమల పర్యటనకు వచ్చిన సమయంలో కాన్వాయ్‌పై రాళ్లు వేయించిన ఘటనను మరిచిపోలేదని గుర్తుచేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని నానా బూతులు తిట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నారని తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. 

జాతీయ మీడియా కూడా దూరం
అయితే.. రెండున్నరేళ్ల కిందట జరిగిన ఘటనలన్నీ బీజేపీ పెద్దలు మరిచిపోయి ఉంటారని బాబు అంచనా. కానీ అవి తలకిందులయ్యా యి. అలాగే.. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు కోసం ప్రచారం చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీ నేతలు సైతం ఆ ఛాయల వైపు తొంగిచూడలేదు. అటు జాతీయ మీడియా సైతం బాబును పట్టించుకోలేదు. 2019 నుంచి అన్ని ఎన్నికల్లో ఓడిపోవడంతో లైట్‌ తీసుకుం ది. ఎల్లో మీడియా మినహా మిగిలిన వారెవరూ పెద్దగా బాబు వైపు కన్నెత్తి చూడలేదు.

జాతీయ మీడియా ప్రతినిధులకు పదే పదే ఫోన్లుచేసి  బాబును కలవాలని కోరితే నలుగురైదుగురు తప్పితే పెద్దగా ఎవరూ రావడానికి ఇష్టపడలే దు. కానీ, ఒకరిద్దరితో మోదీ బాగా పనిచేస్తున్నారంటూ మళ్లీ జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జాతీయ రాజకీయాలో చక్రం తిప్పానని చెప్పుకునే వ్యక్తికి ఎ లాంటి దుస్థితి వచ్చిందని పలువురు చర్చించుకోవడం హాట్‌ టాపిక్‌ అయింది. మరోవైపు.. కాశ్మీర్‌ పర్యటన ముగిసిన తర్వాత అమిత్‌ షా కార్యాలయం నుంచి పిలుపు వస్తుందని కేడర్‌కు టీడీపీ వర్గాలు సర్దిచెప్పుకుంటున్నాయి.

అందుకే నో అపాయింట్‌మెంట్‌
అధికారంలో ఉన్న సమయంలో తిరుమలకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అమిత్‌ షా కాన్వాయ్‌పై నాడు రాళ్లేయించిన చంద్రబాబు ఇప్పుడు అపాయింట్‌మెంట్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఎలాగోలా అమిత్‌ షాను కలిస్తే కేడర్‌లో కొంత విశ్వాసం కలుగుతుందని, దానివల్ల రాజకీయ లబ్ధిచేకూరుతుందని టీడీపీ నేతలు భావించినా.. చంద్రబాబు గత చరిత్రను మర్చిపోవద్దని కాషాయ నేతలు కేంద్రంలోని పెద్దలకు చెప్పారట. అందుకే చంద్రబాబు అండ్‌ కో..కు ఎవరి అపాయింట్‌మెంట్‌ దొరకలేదని అంటున్నారు.

టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనను అడ్డం పెట్టుకుని అయినా కలవాలనుకున్నా.. బీజేపీ నేతలు ఆ చాన్స్‌ ఇవ్వలేదని, చంద్రబాబును కేంద్ర పెద్దల దగ్గరకు రానివ్వబోరని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. చివరికి.. కష్టపడి ప్లాన్‌చేసిన పర్యటన ఫలితాన్నివ్వకపోవడంతో  మంగళవారం సాయంత్రం చంద్రబాబు, ఆయన బృందం ఉసూరుమంటూ హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు. రాష్ట్రపతికి వినతిపత్రంతోనే పర్యటన ముగిసింది. 

మరిన్ని వార్తలు