సర్జికల్‌ స్ట్రైక్స్‌, అయోధ్య విషయంలో వారు సంతోషంగా లేరు! ప్రధాని ఆగ్రహం

16 Feb, 2022 14:59 IST|Sakshi

ఛండీగఢ్‌ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పంజాబ్‌లో పోరు రసవత్తరంగా మారింది. పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి. ఈ ఎన్నికల్లో కమలం జెండా ఎగురువేయాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తుండగా మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఇక, మొదటిసారిగా పంజాబ్‌ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ వినూత్న ప్రచారంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బుధవారం పఠాన్‌కోట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు నేరాల్లో భాగస్వాములు అవుతున్నాయని ఆరోపించారు. ఆప్‌ పార్టీని కాంగ్రెస్‌ ఫొటోకాపీ అని అభివర్ణించారు. అయోధ్య రామ మందిర నిర్మాణం, భారత సైన్యం తమ ప్రతిభను చాటిచెప్పినప్పుడు వీరు సంతోషంగా లేరని విమర్శలు గుప్పించారు. ఒక పార్టీ పంజాబ్‌ను పూర్తిగా దోచుకుంది.. మరోపార్టీ ఢిల్లీలో అవినీతి చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆప్‌.. కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తీసుకుందని మోదీ ఆసక్తికర వ‍్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో ఈసారి ప్రభుత్వం కచ్చితంగా మారాలి (iss baar pakka parivartan) అని పంజాబీలు నిర్ణయించుకున్నారని ప్రధాని ఆశాభావం వ్యక్తపరిచారు. 2016 పఠాన్‌కోట్ దాడిలో మరణించిన సైనికుల త్యాగాలను కాంగ్రెస్ తక్కువ చేసి అవమానించిందని మోదీ ఆరోపించారు. దాడికి కాంగ్రెస్ పార్టీ తప్ప దేశమంతా కలిసికట్టుగా ఉందన్నారు. దాడులపై కాంగ్రెస్‌ పార్టీ..సైనికుల త్యాగాలను తక్కువ చేసిందని విమర్శించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో కూడా రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని ప్రశ‍్నించడాన్ని ప్రధాని తప్పుబట్టారు. 1965లో కాంగ్రెస్‌ ప్రయత్నించి ఉంటే గురునానక్‌ జన్మస్థలం(కర్తార్‌పూర్‌ గురుద్వారా) భారతదేశంలో ఉండేదని ప్రధాని మోదీ తెలిపారు.

మరిన్ని వార్తలు