యువత రాజకీయాల్లోకి రావాలి

13 Jan, 2021 04:59 IST|Sakshi

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి శత్రువు 

వాటి అసమర్థత వల్ల దేశానికి భారమవుతాయి 

యువజన పార్లమెంట్‌ ఉత్సవాల్లో ప్రధానమంత్రి మోదీ 

సాక్షి, న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువని, వాటి అసమర్థత దేశానికి భారం అవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాల అసమర్థత, చేతకానితనం నియంతృత్వానికి కొత్త రూపం ఇస్తుందని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ, లోక్‌సభ సచివాలయం సంయుక్తంగా ఇక్కడి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో నిర్వహించిన రెండో జాతీయ యువజన పార్లమెంట్‌ ఉత్సవాల్లోని ముగింపు సమావేశంలో ప్రసంగించిన మోదీ.. వారసత్వ రాజకీయాలపై విమర్శల దాడి చేశారు.  ‘వారు తమ సొంత కుటుంబాలలో ఇటువంటి ఉదాహరణలను చూస్తారు. అందువల్ల వారికి చట్టంపై గౌరవం గానీ భయం గానీ ఉండదు..‘అని ఆయన అన్నారు.

యువతను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ.. రాజకీయాలను కాపాడాలంటే ఇది అవసరమని పేర్కొన్నారు. ప్రధాని ఏ పార్టీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. గతంలో కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలపై ఇలాంటి విమర్శలు చేశారు. వారసత్వ రాజకీయాలు కూడా దేశంలో రాజకీయ, సామాజిక అవినీతి వెనుక దాగిన పెద్ద కార ణాల్లో ఒకటి అని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యంలో కొత్త నియంతృత్వానికి దారితీస్తాయన్నారు. ‘నేషన్‌ ఫస్ట్‌(ముందుగా దేశం) అన్న సెంటిమెంట్‌కు బదులుగా నేను మరియు నా కుటుంబం అన్న సెంటిమెంట్‌ను ఈ రాజకీయాలు బలోపేతం చేస్తాయి..’అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు