Mamata Banerjee: మోదీ సమావేశం సూపర్‌ ఫ్లాప్‌

21 May, 2021 06:23 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విమర్శ

కోల్‌కతా: దేశంలో కోవిడ్‌ పరిస్థితిపై గురువారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో కొన్ని రాష్ట్రాల సీఎంల పట్ల మోదీ వ్యవహరించిన తీరుపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన ఈ సమావేశం ఒక సర్వసాధారణమైన ‘సూపర్‌ ఫ్లాప్‌’ అని మమత అభివర్ణించారు. సమావేశం ముగిసిన తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. మోదీతో వర్చువల్‌ సమావేశానికి రాష్ట్రాల ముఖ్యమంత్రు లను ఆహ్వానించారుగానీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేద ని, ఆ సీఎంల ప్రతిష్టను మోదీ ఆటబొమ్మల స్థాయికి దిగజార్చారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎంలను మాట్లాడనీయకుండా వారిని మోదీ అవమానించారని మమత ఆరోపిం చారు. మోదీ అభద్రతాభావంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని మమత వ్యాఖ్యానించారు. అయితే, మమత వ్యాఖ్యలపై మాజీ తృణమూల్‌ సీనియర్‌ నేత, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సువేంధు అధికారి స్పందించారు. ‘మోదీ పూర్తిగా కోవిడ్‌ సంబంధ విషయాలు చర్చించిన సమావేశాన్ని మమత రాజకీయమయం చేశారు. గతంలో ఎన్నోసార్లు ప్రధానితో భేటీల నుంచి మమత ఉద్దేశపూర్వకంగా తప్పుకుని, ఇప్పుడేమో మోదీ–కలెక్టర్ల భేటీలో మాట్లాడే అవకాశం రాలేదంటున్నారు ’ అని సువేంధు వ్యాఖ్యానించారు.

వారి కోసం 20 లక్షల డోస్‌లు ఇవ్వండి
బెంగాల్‌లోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 20 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను కేటాయించాలని మోదీని మమత కోరారు. ఈ మేరకు మమత గురువారం మోదీకి ఒక లేఖ రాశారు. బ్యాంకింగ్, రైల్వే, బొగ్గు, ఎయిర్‌పోర్టులు తదితర ఫ్రంట్‌లైన్‌ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోస్‌లు రాష్ట్రానికి పంపాలని మమత కోరారు.  

మరిన్ని వార్తలు