తెలంగాణ రాష్ట్ర బీజేపీకి మోదీ టానిక్‌!

15 Nov, 2022 11:53 IST|Sakshi

మునుగోడు ఓటమి నుంచి బయటపడేందుకు తోడ్పాటు

ఘాటైన విమర్శలతో టీఆర్‌ఎస్‌ నోరు కట్టేశారన్న భావన

ఇక టీఆర్‌ఎస్‌తో ‘సై అంటే సై’ అంటున్న రాష్ట్ర బీజేపీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ పర్యటన రాష్ట్ర బీజేపీలో నూతనోత్తేజాన్ని నింపింది. తెలంగాణ పర్యటనలో రెండుచోట్ల మోదీ చేసిన ప్రసంగాలు.. మునుగోడు ఓటమి నుంచి కార్యకర్తలను బయటపడేశాయని, స్ఫూర్తి రగిలించాయని పార్టీ నేతలు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడుగా వెళ్లేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు. 

మునుగోడు నుంచి బయటపడేలా...
హై ఓల్టేజీ ప్రచారంతో జాతీయ దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఉప ఎన్నిక ఓటమి.. బీజేపీలో కొంత నైరాశ్యాన్ని మిగిల్చింది. ప్రధాని పర్యటన దాన్ని మాయం చేసిందని పార్టీవర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీకి ప్రతి కూలంగా వచ్చిన ఫలితంతో కుంగిపోకుండా ధైర్యంగా నిలబడేందుకు ఈ పర్యటన ఉపయోగపడిందని చెబుతున్నారు. అయితే.. గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ నాయకత్వం విమర్శలపై అధికార టీఆర్‌ఎస్‌ తీవ్రస్థాయిలో స్పందించేది. మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా దాడి చేసేవారు. ఈసారి మోదీ పర్యటనలో బేగంపేట సభలో టీఆర్‌ఎస్‌పై నేరుగా రాజకీయ విమర్శలు చేశారు. రామగుండంలో కేంద్రం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూనే.. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తోందంటూ రాష్ట్రప్రభుత్వ ప్రచారాన్ని ఖండించారు. పర్యటన ముగిసి రెండు రోజులైనా.. టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు స్పందించలేదు. ఎదురుదాడి చేయలేదు. దీంతో ప్రధాని పర్యటన సూపర్‌ సక్సెస్‌ అయినట్టేనని ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 

టీఆర్‌ఎస్‌ను డైలమాలో పడేశారన్న ధీమా...
మోదీ చేసిన ఘాటైన విమర్శలకు ఏ విధంగా స్పందించాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ పడిందని  అంటున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు  హెచ్చరికలు చేయడం టీఆర్‌ఎస్‌ను డైలమాలో పడేసిందని భావిస్తున్నారు. ప్రధాని హెచ్చరికలు టీఆర్‌ఎస్‌ను ఆత్మరక్షణలో పడేస్తాయని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అవినీతి రహిత పాలన అందించడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని మోదీ స్పష్టంచేయడం ప్రజల మద్దతు కూడగట్టేందుకు దోహదపడుతుందని విశ్వసిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేయడంతో.. తాము ఆ లక్ష్యసాధన దిశగా మరింత పట్టుదలతో కృషి చేయాలనేది స్పష్టమైందని అంటున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌తో ‘సై అంటే సై’ అంటూ దూసుకెళ్లేందుకు ప్రధాని పర్యటన ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపిందని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు