రాజీనామా గురించి సోనియాకు చెప్పా

12 Oct, 2020 16:18 IST|Sakshi

పనిచేసే వారికి కాంగ్రెస్‌లో గుర్తింపు లేదు

కాంగ్రెస్ నేతలకు నాతో ఈగో సమస్యలు

మోదీపై నమ్మకంతోనే బీజేపీ చేరాను

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకంతోనే బీజేపీలో చేరినట్టు సీనియర్‌ నటి కుష్బూ సుందర్‌ తెలిపారు. సోమవారం కమలం పార్టీలో చేరిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ..దేశాన్ని ప్రధాని మోదీ సరైన మార్గంలో ముందుకు తీసుకువెళ్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని, ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడానో సోనియా గాంధీకి రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నానని వెల్లడించారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ  ఏ రోజూ విజయం కోసం పనిచేయలేదన్నారు. తాను టికెట్ కోసం ఎప్పుడూ అడగలేదని, తన రాజీనామాకు అది కారణం కాదన్నారు. తనతో కాంగ్రెస్ నేతలకు ఈగో సమస్యలు ఉన్నాయోమోనని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే తనలాంటి వారికి కాంగ్రెస్‌ పార్టీలో గుర్తింపు లేదని వాపోయారు. బీజేపీలో తనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనేది పార్టీ అధి నాయకత్వం నిర్ణయిస్తుందని కుష్బూ సుందర్‌ పేర్కొన్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మురుగన్ సమక్షంలో అంతకుముందు బీజేపీలో కుష్బూ చేరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో  కుష్బూ  రాజీనామా కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె సేవలను కాంగ్రెస్‌ పార్టీ సరిగా వినియోగించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుష్బూకు బీజేపీ ఎటువంటి బాధ్యతలు కట్టబెడుతుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తమ పార్టీ నుంచి కుష్బూ వెళ్లిపోయినా నష్టం ఏమీ ఉండబోదని తమిళనాడు కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యానించారు.

చదవండి: బీజేపీలో చేరిన సినీనటి కుష్బూ 

మరిన్ని వార్తలు