‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’

28 Jan, 2022 14:54 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్​ పీసీసీ చీఫ్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూపై ఆయన సోదరి శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె అమెరికా నుంచి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సిద్ధూ, డబ్బుల కోసం తల్లినే విడిచిపెట్టాడని, అతను డబ్బు కోసం ఏదైనా చేస్తాడంటూ ఆరోపించారు.

‘ మేము చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం.. మా తల్లి నాలుగు నెలల పాటు ఆసుపత్రిలో ఉంది. సిద్ధూ అసలు పట్టించుకోలేదు. ఇది అసత్య ఆరోపణలు కావు..  దానికి సంబంధించిన  సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. కేవలం ఆస్తుల కోసం తమతో సంబంధాలను తెంచుకున్న క్రూరమైన వ్యక్తిగా సిద్ధూ’ అని ఆమె పేర్కొంది.

1986 సంవత్సరంలో తమ తండ్రి చనిపోయిన తర్వాత..  తల్లిని దిక్కులేని స్థితిలో వదిలేశారని వాపోయింది.  ఆ తర్వాత మా తల్లి 1989లో ఒక అనాథ మహిళగా ఢిల్లీ రైల్వేస్టేషన్​లో చనిపోయిందని యూఎస్​ నుంచి సుమన్​ తూర్‌ ఆవేదన వ్యక్తం చేసింది. అదే విధంగా 1987 ఇండియాటుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సిద్ధూ.. తల్లిదండ్రుల గురించి అసత్యాలే చెప్పాడని ఆరోపించింది.

అదే విధంగా గత జనవరి 20న సిద్దూని కలవడానికి పంజాబ్​ వెళ్లానని కనీసం తలుపులు తీయలేదని.. సుమన్​ తూర్‌ తెలిపారు. తనను చాలా సేపు ఇంటి బయటే నిలబెట్టి అవమానర్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసున్న నాకు .. నా సోదరుడు ఫోన్​లో బ్లాక్​మెయిలింగ్​ చేస్తున్నాడని వాపోయింది. చనిపోయిన నా తల్లికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని సుమన్​ తూర్‌ అన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూ సోదరి చేసిన  ఆరోపణలు పంజాబ్​ కాంగ్రెస్​లో హీట్​ను పుట్టిస్తున్నాయి.  ప్రస్తుతం ఈ ఆరోపణలతో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.

మరిన్ని వార్తలు