Navjot Singh Sidhu: సిద్ధూ ఆప్‌లో చేరబోతున్నాడా?

30 Sep, 2021 15:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు అనూహ్యంగా మారుతున్నాయి. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి పదవికి, పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ రాజీనామా చేయడంతో సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఇద్దరు బలమైన నేతలు రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ చిక్కుల్లో పడింది. అయితే నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆప్‌ కన్వీనర్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. సిద్దూ చేరిక ఊహాగానాలపై స్పందిస్తూ.. పంజాబ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా బలమైన నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని అన్నారు.

నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఆప్‌లో చేరుతారనేది ఊహాత్మకమైన విషయమని తెలిపారు. అటువంటి పరిస్థితులు పంజాబ్‌ చోటు చేసుకుంటే తామే వెల్లడిస్తామని తెలిపారు. మరోసారి బలంగా చెబుతున్నానని​, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ తరఫున బలమైన నేతను సీఎం అభ్యర్థిగా నిలబెడతామని స్పష్టం చేశారు. అది ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఆ విషయానికి సంబంధించి తాము ఆలోచించడంలేదని పేర్కొన్నారు.

దీంతో నవజ్యోత్‌ సింగ్‌ ఆప్‌లో చేరుతారని వస్తున్న వార్తలకు బలం చేకూరుతోంది. నవజ్యోత్‌ సింగ్‌ గతంలో ఆప్‌లో కీలక నేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇ​​క మరోవైపు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ కావటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు