కాంగ్రెస్‌ను ముంచేసి..ఇప్పుడు రాజీనామానా?

10 Mar, 2022 12:55 IST|Sakshi

చంఢీగఢ్‌: పంజాబ్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఈసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్‌కు  ఘోర పరాభవం ఎదురైంది. పంజాబ్‌ కాంగ్రెస్‌లో నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, సీఎం చరణ్‌సింగ్‌ చన్నీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నా చివరి నిమిషంలో వాటిని పక్కన పెట్టే వారు పోటీకి సన్నద్ధమయ్యారు. అయినా ఇది కాంగ్రెస్‌కు సత్ఫలితాలను ఇవ్వలేదు. కాంగ్రెస్‌ గ్రూపు రాజకీయంతో విసుగుపోయిన ప్రజలు ఆప్‌కే పట్టం కట్టారు. ఆది నుంచి కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టిన ఆప్‌ అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. పంజాబ్‌లో ఆప్‌ ఏకపక్ష విజయం సాధించగా, కాంగ్రెస్‌ పూర్తిగా ఢీలా పడిపోయింది.

కాంగ్రెస్‌కు సిద్ధూ గుడ్‌ బై?
పంజాబ్‌ సీఎం పీఠం నుంచి అమరీందర్‌ సింగ్‌ వైదొలగడానికి ప్రధాన కారణమైన సిద్ధూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం పదవి ఆశించే పంజాబ్‌ కాంగ్రెస్‌లో మంట రాజేసిన సిద్ధూ.. ఆపై సీఎం కావొచ్చనే భావించాడు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం చన్నీని ముఖ్యమంత్రి చేసింది. ఇది కూడా సిద్ధూకి జీర్ణించలేదు. పార్టీ మారదామనే ప్లాన్‌ చేశాడు.  మొత్తం కాంగ్రెస్‌నే విచ్ఛిన్నం చేద్దామనే అనుకున్నాడు. తనకు దక్కనిది వేరే వాళ్ల దక్కడంతో వివాదాలకు ఆజ్యం పోశాడు. కానీ చివరకు రాహుల్‌ గాంధీ జోక్యంతో సిద్ధూ వెనక్కి తగ్గి కాంగ్రెస్‌తో నడిచాడు. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా చన్నీని అధిష్టానం ప్రకటించినా సిద్ధూ మిన్నుకుండిపోయాడు. 

సీఎం క్యాండిడేట్‌ తనకు ప్రాబ్లమ్‌ లేదని, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పాడు. ఇప్పుడు కాంగ్రెస్‌ దారుణ పరాజయం దిశగా సాగుతుండటంతో సిద్ధూకు రాజీనామ ఒక్కటే మార్గంలా కనబడుతోంది. ఇవాళ సాయంత్రం ఆ రాష్ట్ర సీఎల్పీ సమావేశం నిర్వహించాలని భావించినా అందుకు పలువురు కాంగ్రెస్‌ నేతలు దూరంగా ఉండాలని అనుకున్నారట. అందులో సిద్ధూ కూడా ఉన్నాడని, తాను రాజీనామా చేయబోతున్నట్లు సీఎల్పీకి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు చేసిన నష్టమంతా చేసి ఇప్పుడు రాజీనామా డ్రామాకు తెరలేపడం మళ్లీ హాట్‌టాపిక్‌ అయ్యింది. 

చదవండి: పంజాబ్‌లో అఖండ ‘ఆప్‌ కీ సర్కార్‌’.. ఫలించిన ‘ఎక్‌ మౌకా’ నినాదం

మరిన్ని వార్తలు