Navjot Singh Sidhu: పదవి ఉన్నా, లేకున్నా వారి పక్షాన నిలబడతా

2 Oct, 2021 21:12 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

చండీగఢ్‌: పంజాబ్‌లో ఇద్దరు కీలక నేతలు నవ జ్యోత్‌సింగ్‌ సిద్ధూకెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామాలతో కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇరువురు నేతలు తీసుకునే నిర్ణయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ స్పందిస్తూ.. తనకు పదవి ఉన్నా.. లేకపోయినా కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన అండగా నిలబడతానని అన్నారు.

చదవండి: పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకారం

శనివారం జాతి పిత మహత్మా గాంధీజీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రీ జయంతి సందర్భంగా ట్వీట్‌ చేశారు. ‘తాను గాంధీ, శాస్త్రీల సిద్ధాంతాలను పాటిస్తాను. నాకు కాంగ్రెస్‌ పార్టీలో పదవి ఉన్నా.. లేకున్నా రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన నిలబడతాను. వ్యతిరేక శక్తులు నన్ను కిందకు తోయాలని చూసినా అంతకు మించిన ఆశావాదంతో పంజాబ్‌లో ప్రతి పౌరుడి గెలుపు కోసం కృషి చేస్తాను’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

గురువారం పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీతో భేటీ అయిన సిద్దూ.. తిరిగి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించినట్లు సమాచారం. పంజాబ్‌లో డీజీపీ, అడ్వొకేట్‌ జనరల్‌ నియామకంపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక నియామకాన్ని నిలిపివేస్తామని సీఎం చన్నీ హామీ ఇవ్వడంతో సిద్ధూ మెత్తబడినట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు