శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం.. ఎన్‌సీపీలో ఆ విభాగాలన్నీ రద్దు

21 Jul, 2022 09:02 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో అధికార మార్పిడితో రాజకీయాలు వేడెక్కిన వేళ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌సీపీలోని అన్ని విభాగాలు, సెల్స్‌ను రద్దు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు. ‘ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఆమోదంతో తక్షణమే అన్ని విభాగాలు, సెల్స్‌ రద్దయ్యాయి.’ అని పేర్కొన్నారు. అయితే.. నేషనలిస్ట్‌ మహిళా కాంగ్రెస్‌, నేషనలిస్ట్ యువ కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ విద్యార్థి కాంగ్రెస్‌లను మినహాయించినట్లు చెప్పారు. 

అయితే.. పార్టీలో ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనక గల కారణాలను వెల్లడించలేదు కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌. మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయిన కొన్ని రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. శివసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఎన్‌సీపీ కీలక భూమిక పోషించింది. శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో వారి ప్రభుత‍్వం కూలిపోయింది. షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆ రాష్ట్రంలో ఇంకా రాజకీయ వేడి తగ్గలేదు.

ఇదీ చదవండి: శరద్‌ పవార్‌ (ఎన్సీపీ లీడర్‌) రాయని డైరీ

మరిన్ని వార్తలు