బిహార్‌ స్పీకర్‌గా ఎన్డీయే అభ్యర్థి విజయ్‌ సిన్హా

25 Nov, 2020 14:23 IST|Sakshi

పాట్నా : బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయ్‌ కుమార్‌ సిన్హా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికలో విజయ్‌ సిన్హాకు 126 ఓట్లు రాగా మహా కూటమి తరపున పోటీ చేసిన అవద్‌ బిహార్‌ చౌదరికి 114 ఓట్లు దక్కాయి. కాగా బిహార్‌లో దాదాపు 50 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న స్పీకర్‌ పదవికి ఎన్డీయే కూటమి తరపున విజయ్‌ కుమార్‌ సిన్హా, మహా కూటమి తరపున అవద్‌ బిహారీ చౌదరి పోటీలో నిలిచారు. వీరిద్దరూ మంగళవారం పట్నా నుంచి అసెంబ్లీ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో బిహార్‌ అసెంబ్లీలో భారీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: బిహార్‌లో లాలూ ఆడియో టేపుల కలకలం

అసెంబ్లీలోకి ఎమ్మెల్సీలు రావడంతో స్పీకర్‌ ఎన్నికల్లో వాయిస్‌ ఓట్లను ఆర్జేడీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ముఖ్యంగా సీఎం నితీశ్‌ కుమార్‌, అశోక్‌ చౌదరి సభలో ఉండటాన్ని తప్పుబడుతూ.. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్‌ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ.. స్పీకర్‌ ఎన్నిక సమయంలో నియమాలను పాటించాలని చెబుతూ..  రూల్‌బుక్‌ను ప్రొటెం స్పీకర్ జితన్ రామ్ మాంజీకి అందించారు. దీనిపై స్పందించిన ప్రొటెం స్పీకర్‌.. ‘అసెంబ్లీ పక్షనేతగా సీఎం సభలో ఉండటం తప్పేం కాదు. అది చట్టబద్దమైనది. ఇతర సభ నుంచి వచ్చిన వారు స్పీకర్ ఎన్నికల్లో ఓటు వేయడంలేదు. అసెంబ్లీలో వారు ఉండటంలో ఎలాంటి సమస్య లేదు" అని ఆయన అన్నారు.

అదే విధంగా గతంలో లాలూ యాదవ్‌ లోక్‌సభ సభ్యుడిగా.. రబ్రీదేవి సీఎంగా ఉన్నప్పుడు వారు కూడా ప్రొసిడింగ్స్‌కు హాజరయ్యారని తేజస్వీ యాదవ్‌ తల్లిదం‍డ్రులను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. అప్పుడు రహస్య ఓటింగ్‌ లేదని గుర్తు చేశారు. అనంతరం స్పీకర్‌గా ఎన్నికైన విజయ్‌ కుమార్‌ సిన్హాను సీఎం నితీశ్‌‌ కుమార్‌, డిప్యూటీ సీఎంలు తార్‌ కిషోర్‌ ప్రసాద్‌, రేణు దేవి.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లు కలిసి స్పీకర్‌ పోడియం వద్దకు తీసుకెళ్లారు. ఇక ఇటీవల జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సంపూర్ణ మెజారిటీ సాధించడంతో వరుసగా నాలుగోసారి బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 243 అసెంబ్లీ స్థానాల్లో 126 ఎన్డీయే దక్కించుకోగా ఇందులో బీజేపీ 74, జనతాదళ్‌(యు) 43 మరో ఎనిమిది సీట్లను ఎన్డీయే మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. మరోవైపు ఆర్జేడీ 75 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాగా 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 19 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. బిహార్‌ ప్రజలకు ఉచితంగానే వ్యాక్సిన్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు