పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్‌ కేంద్రానికి..

13 Feb, 2021 18:45 IST|Sakshi

శ్రీకాకుళం: జిల్లాలో కొత్తగా పెళ్లైన జంటలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పలాస మండలం బొడ్డపాడులో ఓ జంట ఓటు వేయడానికి రాగా, వజ్రపుకొత్తూరు మండలం చిన్నవంక గ్రామపంచాయతీ పరిధిలోని గుల్లలపాడు గ్రామానికి చెందిన మరొక జంట కూడా తమ ఓటు వేయడానికి పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్‌ కేంద్రానికి వచ్చింది.  

బొడ్డపాడులో రమేష్‌, సింధూల వివాహం జరిగిన వెంటనే ఓటు హక్కును వినియోగించుకోగా, మరొక జంట గౌతమీ-యోగేశ్వరరావులు తమ ఓటును వేశారు.   వివాహం జరిగిన అనంతరం తన  భర్తతో కలసి చిన్నవంక పోలింగ్ బూత్ కి చేరుకొని గౌతమీ..  ఓటు వినియోగించుకున్న అనంతరం మురిపింటివాని పేట చేరుకొని అక్కడ వరుడు యోగేశ్వరరావు ఓటును  వినియోగించుకున్నారు. నూతన దంపతులు ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ జె నివాస్ అభినందించారు. వీరు యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారని ప్రశంసించారు. 

కాగా, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం గం. 3.30వరకూ పోలింగ్‌ జరగ్గా, నాలుగు గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమైంది. రెండో దశలో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.  దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్‌ జరిగింది. 

మరిన్ని వార్తలు