‘బీజేపీ బుల్డోజర్‌’ అంటే కేటీఆర్‌కు భయం: జీవీఎల్‌

24 Apr, 2022 04:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయబావుటా ఎగరవేస్తుందన్న భయంతోపాటు బీజేపీ బుల్డోజర్‌ వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదనే కారణంగానే తెలంగాణ మంత్రి కె.తారక రామారావు ప్రధాని మోదీపై హద్దు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. కేంద్రం విస్తృతంగా సహాయం చేస్తున్నప్పటికీ విమర్శిస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని కేటీఆర్‌ ఇటీవల బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారని, దీనిని బట్టే బీజేపీ అంటే టీఆర్‌ఎస్‌కు ఉన్న భయమేంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో జీవీఎల్‌ మాట్లాడుతూ కేంద్రంపై విషం చిమ్ముతూ తప్పుడు రాతలు రాసినా, ప్రసారం చేసినా ఉపేక్షించేది లేదని పలు పత్రికలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బీజేపీపై తప్పుడు ప్రచారం, విమర్శలు చేస్తే చట్టబద్ధంగా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. యూపీఏ హయాంలో కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 రెట్లు ఎక్కువగా తెలంగాణకు నిధులు ఇస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యానికి కుటుంబ పార్టీల నుంచి ముప్పు పొంచి ఉందని, ఆ పార్టీల పాలన దూరం చేసేలా 2024 ఎన్నికల ఎజెండాను ప్రధాని ఖరారు చేశారన్నారు. ‘ఏపీలో కేంద్ర వాటాకింద నిధులు ఇస్తున్నా, ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్‌సీపీ స్టిక్కర్లు పెడుతున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉపయోగిస్తే, కేంద్రం వాటా ఉందని చెప్పాలని, తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. సబ్సిడీ బియ్యం పథకానికి మీ ఫొటోలు ఎలా పెడతారు. ఈ అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమాధానం చెప్పాలి’అని జీవీఎల్‌ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రమంత్రులు పర్యటించి, కేంద్ర పథకాలపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చే అంశాలకే నిధులు ఇవ్వాలని కోరతానని చెప్పారు.   

మరిన్ని వార్తలు