పుదుచ్చేరి సీఎంకు మళ్లీ కొత్త చిక్కులు

28 May, 2021 07:02 IST|Sakshi

పెరిగిన బీజేపీ బలం 

కీలక పదవులపై గురి 

పుదుచ్చేరిలో రసవత్తరం

అధికార పగ్గాలు చేపట్టిన పుదుచ్చేరి సీఎం రంగస్వామి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సభలో బీజేపీ సభ్యుల బలం పెరగడంతో సంకటంలో పడ్డారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, రెండు మంత్రి పదవుల కోసం బీజేపీ పట్టుబడుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌–10, బీజేపీ–6, డీఎంకే–6, కాంగ్రెస్‌–2, స్వతంత్రులు ఆరుగురు గెలిచారు. బీజేపీ–ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూట మి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత రంగస్వామి సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఆయన కరోనాతో ఆస్పత్రిలో చేరడంతో ఎల్జీ తమిళిసై పరిపాలన చేపట్టా రు. ఆస్పత్రి నుంచి సీఎం రాగానే 23 రోజుల అనంతరం బుధవారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ సభ్యులు ఆరుగు రు, నామినేటెడ్‌ ఎమ్మెల్యేలతో కలిపి అసెంబ్లీలో బీజేపీ బలం తొమ్మిదికి చేరింది.

దీనికితోడు ముగ్గు రు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన చేరారు. అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ నిర్మల్‌కుమార్, సీనియర్‌ నేత నమశ్శివాయంతో భేటీ కావడం, ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆశీస్సులు అందుకోవడం చర్చకు దారి తీసింది. బీజేపీ బలం 12కు చేరిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, రెండు మంత్రి పదవుల్ని తమకు కట్టబెట్టాలన్న డిమాండ్‌ తెరమీదకు వచ్చింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న దృష్ట్యా డిప్యూటీ సీఎం పదవిని ఇస్తే తనను డమ్మీని చేస్తారని సీఎం రంగస్వామి ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అలాగే తన పార్టీలోనూ ముఖ్య నేతలు పదవుల్ని ఆశిస్తుండంతో సీఎంకు శిరోభారం తప్పడం లేదు. ఈ క్రమంలో సీఎం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. పదవుల విషయంలో బీజేపీ నుంచి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైన పక్షంలో డీఎంకే, తటస్థంగా ఉన్న మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలిసింది.

చదవండి: ‘మా వల్లే సంపన్నులై.. మాకే ఓటు వేయరా?’: మంత్రి     
ఫొటో మోదీది.. బాధ్యత రాష్ట్రాల పైనా?

మరిన్ని వార్తలు