దొంగల రాజ్యానికి రాజులు

26 Mar, 2021 04:16 IST|Sakshi

మోదీ, అమిత్‌ షాలపై మమత ధ్వజం

పథార్‌ప్రతిమ (పశ్చిమబెంగాల్‌): ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చడానికి బీజేపీ మద్దతుతో కొత్త పార్టీ పుట్టుకొచ్చిందని, ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌(ఐఎస్‌ఎఫ్‌)ను ఉద్దేశిస్తూ, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ విమర్శించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడికి బీజేపీ నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. దక్షిణ 24 పరగణలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రముఖ ముస్లిం మతపెద్ద అబ్బాస్‌ సిద్దిఖీ ఇటీవల ఐఎస్‌ఎఫ్‌ను స్థాపించిన విషయం, కాంగ్రెస్, వామపక్ష కూటమితో ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలు కూడా బీజేపీతో ఒక అవగాహన కుదుర్చుకున్నాయని మమత ఆరోపించారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌)ల అమలును తృణమూల్‌ కాంగ్రెస్‌ అడ్డుకోగలదని, తమ పార్టీ అధికారంలో ఉంటేనే మత సామరస్యం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. అవసరమైన ప్రతీసారి ప్రజల పక్షాన నిలిచినందువల్లనే తనను దొంగగా, హంతకురాలిగా ప్రచారం చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ‘దోపిడీ దొంగల రాజు’లని అభివర్ణించారు. ‘కేంద్రం రాష్ట్రాన్ని దోచుకుంటోంది కానీ సాయం చేయడం లేదు’ అన్నారు.

మరిన్ని వార్తలు