అన్నీ రహస్యాలే.. జయ లలిత కేసులో అసలేం జరిగింది?

27 Oct, 2022 08:22 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం సహజ మరణం కాదని.. ఆమె మరణం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని జయ అభిమానులు ఆరేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు. వివిధ కోణాల్లో ఈ డెత్ మిస్టరీ కేసును పరిశోధించిన జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో వ్యవహారం మొత్తం కొత్త మలుపు తిరిగింది. శశికళ పాత్రపై దర్యాప్తు జరపాల్సిందేనన్న కమిటీ సిఫారసు కొత్త మంటలు రాజేసింది.
చదవండి: తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ

2016  సెప్టెంబరు 22న నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపస్మారక స్థితిలో చెన్నయ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, డీ హైడ్రేషన్ లతో ఆసుపత్రిలో చేరారన్నారు కానీ ఎవరూ ఏం చెప్పలేదు. అన్నీ రహస్యంగానే జరిగిపోయాయి. అప్పుడప్పుడు ఒకటో, రెండో విషయాలు తెలిసినా.. అంతా నిగూఢమే. సాధారణ డైట్ తీసుకుంటున్నారని, జయలలిత పరిస్థితి బానే ఉందని రెండు మూడు రోజుల పాటు చెప్పుకొచ్చినా.. తర్వాత విదేశాలకు చికిత్స కోసం తీసుకెళ్తారంటూ ప్రచారం జరిగింది. సెప్టెంబరు 29న ఈ పుకార్లను ఖండించిన అపోలో వైద్యులు జయలలిత కోలుకుంటున్నారని.. వైద్యానికి బాగా స్పందిస్తున్నారని చెప్పారు.

రోజుకో మలుపు
నవంబరు 13న  అంటే ఆసుపత్రిలో చేరిన 50 రోజుల తర్వాత జయలలిత సంతకంతో ఉన్న ఒక లేఖను విడుదల చేశారు. అందులో ఆమె తాను పునర్జన్మ పొందినట్లు పేర్కొనడమే కాదు త్వరలోనే ముఖ్యమంత్రి విధుల్లో నిమగ్నమవుతానని వెల్లడించినట్టు పేర్కొన్నారు. రెండున్నర నెలల పాటు ఆసుపత్రి వర్గాలతో పాటు అన్నాడిఎంకే నేతలు జయలలిత ఆరోగ్యం బానే ఉందని చెబుతూ వచ్చారు.

పక్కా స్క్రిప్టింగ్‌
ప్రజలను ఊరడించడానికన్నట్లు రోజుకో సమాచారాన్ని కొద్దికొద్దిగా విడుదల చేశారు. అమ్మ కోలుకుందని.. అమ్మ పేపర్ చదివిందని.. అమ్మ టిఫిన్ తిందని.. అమ్మ టీవీ చూసిందని.. వెల్లడించారు. నవంబరు 19న జయలలిత వెంటిలేటర్ అవసరం లేకుండానే వైద్యానికి చక్కగా స్పందిస్తున్నారని ప్రకటించారు. 2016 డిసెంబరు 4న ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని త్వరలోనే ఆసుపత్రి నుండి ఇంటికి డిశ్చార్జ్ అవుతారని అన్నాడిఎంకే పార్టీ ప్రకటించింది. చిత్రంగా డిసెంబరు 5న రాత్రి 11గంటల 30 నిముషాలకు ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు.

పుకార్లు షికార్లు
ఇన్ని మలుపులు తిరగడంతో తమిళనాట రక రకాల పుకార్లు షికార్లు చేశాయి. జయలలితపై విష ప్రయోగం చేసిందని కొందరు ప్రచారం చేశారు. రోజుల తరబడి స్లో పాయిజన్ ఇచ్చి జయలలితను మట్టుబెట్టారని దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని పార్టీలో జయ విధేయులు ఆరోపణలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. అపోలో వర్గాలు.. ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం అనుమానాలు అలానే ఉండిపోయాయి.

ఇంట్లో గొడవ జరిగిందా?
జయలలిత ను ఆసుపత్రిలో చేర్చేసరికే ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇంట్లో ఉండగానే జయలలితను అనారోగ్యం పాలు చేసేలా  కుట్రలు జరిగాయని పుకార్లు పుట్టాయి. జయలలితకు స్లో పాయిజన్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం శశికళపైనే ఎక్కుపెట్టారు.

చెలి నెచ్చెలి
జయలలితకు శశికళ తో 30 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే జయలలితను అడ్డు పెట్టుకుని శశికళ కుటుంబం ప్రభుత్వంలో చొచ్చుకుపోయిందని ఆరోపణలు వచ్చాయి. ఓ దశలో జయలలితను ముఖ్యమంత్రి పీఠం నుండి తప్పించడానికి కుట్ర పన్నినట్లు నిఘా బృందాలు ఉప్పందించాయి. ఈ పరిస్థితుల్లో శశికళ కుటుంబాన్ని ఇంటి నుండి సాగనంపారు జయలలిత. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మన్నార్ గుడి మాఫియాకు అడ్డుకట్ట వేశారు.
అయితే ఏం జరిగిందో కానీ కొంతకాలం తర్వాత శశికళకు మళ్లీ ఇంట్లో చోటిచ్చారు జయ. అదే జయలలిత  కెరీర్ లో అతి  పెద్ద తప్పిదమని శశికళను వ్యతిరేకించే వర్గాలు అంటాయి.

నివేదికలో ఉన్నవేంటీ?
జయలలిత డిసెంబరు 4న మరణిస్తే  డిసెంబరు 5న మరణించినట్లు ప్రకటించారని నివేదికలో పేర్కొన్నారు.
జయలలితకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటనేదానిపై క్లారిటీ లేదని నివేదికలో పేర్కొన్నారు.
వైద్యులు సిఫార్సు చేసిన కొన్ని సర్జరీలు ఎందుకు చేయలేదో అర్ధం కాలేదని వ్యాఖ్యానించారు.
ఆమెకు సరైన వైద్యం అందలేదని కూడా అన్నారు.
జయలలిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది లగాయితు ఆమె మరణించే వరకు ఏం జరిగిందో అంతా మిస్టరీగానే ఉంది

జయలలిత ఆసుపత్రిలో చేరడానికి ముందు పోయస్ గార్డెన్‌లో ఓ వ్యక్తితో వాగ్వివాదం జరిగిందని.. ఆ సమయంలో అవతలి వ్యక్తి తోసేయడంతో జయలలిత కిందపడిపోయారని మాజీ స్పీకర్ పాండ్యన్ ఆరోపించారు. 

శరీరంపై గాట్లేంటీ?
జయలలితను ఆసుపత్రిలో చేర్చినపుడు ఆమె బుగ్గపై  నాలుగు గాట్లు కనిపించాయి. ఆ గాట్లు ఏంటి? ఏమైనా గాయాలా? గాయాలైతే ఎవరు చేశారు? అన్న అనుమానాలు చక్కర్లు తిరిగాయి. అయితే  వైద్యులు మాత్రం తీవ్ర అస్వస్థతకు లోనైనపుడు కొన్ని సందర్భాల్లో బుగ్గలపై అటువంటి గాట్లు ఉంటాయని అన్నారు.

అంతలోనే రాజకీయమా?
జయలలిత చికిత్స పొందుతున్న సమయంలోనే పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ వరుస భేటీలు నిర్వహించడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇపుడు తాజాగా జయమరణం కేసుపై నివేదిక బహిర్గతం కావడంతో శశికళ భవిష్యత్తు ఏ విధంగా మలుపులు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తమిళ నాట అంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ప్రజలకైతే నిజాలు కావాలి. జయలలితను జీవితాంతం ఆదరించిన  అభిమానులకు ఏం జరిగిందో తెలియాలి. తమ అభిమాన నాయకురాలి మరణ వార్త వెనుక కుట్ర ఉందంటేనే వారు  కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పటికైనా నిజాలు  బయటకు వస్తేనే వారికి కొంతైనా తృప్తి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు